Uttar Pradesh: పాస్ మార్కులు వేయకుంటే నా గాళ్ ఫ్రెండ్ వదిలేసి వెళ్లిపోతుంది.. ప్లీజ్!: ఎగ్జామ్ జవాబు పత్రంలో యూనివర్సిటీ విద్యార్థి వేడుకోలు
- ఆన్సర్ షీట్లలో భక్తి పాటలు, భజనలు రాసిన విద్యార్థులు
- కొందరైతే తమకు కనీసం పాస్ మార్కులు వేయాలని వేడుకోలు
- కరెన్సీ నోట్లు జత చేసిన మరికొందరు
ఉత్తరప్రదేశ్‌లోని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు తమలోని భక్తిభావాన్ని పరీక్షల్లో వెలికి తీశారు. వర్సిటీ ఫైనల్ ఎగ్జామ్స్‌లో సమాధానాలకు బదులు హనుమాన్ చాలీసా, భజనలు, అర్చనలు చక్కగా రాశారు. తాజాగా ఆ పేపర్లను దిద్దుతున్న అధికారులు విద్యార్థులు రాసిన సమాధానాలను చూసి విస్తుపోయారు. వారికి మతిపోయినంత పనైంది.
భక్తి పాటలు, హారతి, భజన పాటలతో జవాబు పత్రాలను నింపేశారు. ఓ విద్యార్థి అయితే వారు రాసిన పాటల లైన్లకు అర్థాలు కూడా రాసినట్టు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ‘‘నేను బాగా చదువుతానని నా గాళ్ ఫ్రెండ్ అనుకుంటోంది. కనీసం నాకు పాస్ మార్కులైనా వేయండి, లేదంటే ఆమె నన్ను విడిచి వెళ్లిపోతుంది’’ అని మరో విద్యార్థి ఆన్సర్ షీట్‌పై రాసి వేడుకున్నాడు.
రాష్ట్ర వ్యాప్తంగా ఫైనల్ ఎగ్జామ్స్‌ను 5.5 లక్షల మంది రాసినట్టు చెప్పిన అధికారులు రోజుకు 5 వేల పేపర్లను దిద్దుతున్నట్టు చెప్పారు. చాలామంది విద్యార్థులు.. తాము ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ కాలేదని రాయడం గమనార్హం. ఓ పొలిటికల్ సైన్స్ విద్యార్థి అయితే పేపర్ మొత్తాన్ని హనుమాన్ చాలీసాతో నింపేశాడు. మరో విద్యార్థి అయితే 20 పేజీల్లో తన వ్యక్తిగత వివరాలను రాసుకున్నాడు. ఫిల్మ్ స్క్రిప్ట్‌లు, కవితలు రాసిన ఆ విద్యార్థి తనను ఎలాగైనా పాస్ చేయాలని వేడుకున్నాడు. ఇక కొందరైతే తమ ఆన్సర్ షీట్లకు కరెన్సీ నోట్లు జత చేయడం కొసమెరుపు.