IPL: ఐపీఎల్ నుంచి బెంగళూరు ఔట్.. తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో కోహ్లీ సేన బోల్తా!
- బెంగళూరు ఓటమిని శాసించిన శ్రేయాస్ గోపాల్
- ఐపీఎల్ నుంచి కోహ్లీ సేన ఇంటి ముఖం
- ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకున్న ఆర్ఆర్
ఐపీఎల్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిష్క్రమించింది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో బోల్తాపడింది. తొలుత వరుస పరాజయాలతో అట్టడుగున నిలిచి, ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుస విజయాలతో అభిమానుల్లో ప్లే ఆఫ్ ఆశలు రేకెత్తించిన కోహ్లీ సేన కీలమైన మ్యాచ్‌లో కుప్పకూలింది. ఫలితంగా ఈ సీజన్‌లో బెంగళూరు కథ ముగిసింది.
జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో శనివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ రాహుల్ త్రిపాఠీ 58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ అజింక్యా రహానే 33, హన్రిక్ క్లాసెన్ 32 పరుగులు చేశారు.
అనంతరం 165 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 20 పరుగుల వద్ద కోహ్లీ (4) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మిస్టర్ 360 డివిలియర్స్ పార్థివ్ పటేల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే 75 పరుగుల వద్ద శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లో పార్థివ్ (33) స్టంపౌట్ అయ్యాడు. 35 బంతుల్లో 7 ఫోర్లతో 53 పరుగులు చేసి దూకుడు మీదున్న డివిలియర్స్‌ను కూడా శ్రేయాస్ గోపాల్ పెవిలియన్‌కు పంపాడు. అప్పటి వరకు 75/2తో విజయం దిశగా దూసుకెళ్తున్నట్టు కనిపించిన బెంగళూరు డివిలియర్స్ ఔట్ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది.
శ్రేయాస్ గోపాల్ బెంగళూరును దారుణంగా దెబ్బ కొట్టాడు. నిప్పులు చెరిగే బంతులతో నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు పతనాన్ని శాసించాడు. మొయిన్ అలీ (1), మన్‌దీప్ సింగ్‌లను కూడా పెవిలియన్ పంపి బెంగళూరు ఆశలు నీరు గార్చాడు. ఉనద్కత్ రెండు వికెట్లు తీసుకుని మిగతా పనిని పూర్తి చేశాడు. రాజస్థాన్ బౌలర్ల దెబ్బకు 134 పరుగులకే బెంగళూరు ఆలౌట్ అయింది. 36 పరుగుల వ్యవధిలో ఆరు కీలక వికెట్లు కోల్పోయిన బెంగళూరు తగిన మూల్యం చెల్లించుకుంది. ఐపీఎల్ నుంచి ఇంటి బాట పట్టింది. నాలుగు వికెట్లు తీసిన రాజస్థాన్ బౌలర్ శ్రేయాస్ గోపాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. బెంగళూరును ఇంటికి పంపిన రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.