India: ఇండియాలో అతి తక్కువ రోజులు సీఎంగా పనిచేసిన వారి వివరాలు!
- ప్రమాణ స్వీకారం చేసిన మూడోరోజునే దిగిపోయిన యడ్డీ
- యూపీలో జగదాంబికా పాల్ రికార్డు సమం
- ఈ జాబితాలో ఓం ప్రకాష్ చౌతాలా, నితీశ్ కుమార్, జానకీ రామచంద్రన్
అధికార పీఠాన్ని ఇలా ఎక్కి.. అలా దిగిపోయిన వారి జాబితాలో యడ్యూరప్ప రెండోసారి చేరిపోయారు. మూడు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన కన్నడ రాజకీయాలు యడ్డీ రాజీనామాతో తాత్కాలికంగా ముగిశాయి. 17వ తేదీన కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప, నిన్న అసెంబ్లీ సమావేశం అనంతరం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పదవి మూన్నాళ్ల ముచ్చటగా మిగిలింది. ఈ నేపథ్యంలో అతి తక్కువ రోజులు సీఎంగా పనిచేసిన వారి వివరాలు ఓమారు పరిశీలిస్తే...
ఉత్తరప్రదేశ్ లో 1998 ఫిబ్రవరి 21 నుంచి 23 వరకూ జగదాంబికా పాల్ సీఎంగా పనిచేసి రాజీనామా చేశారు. బీహార్ లో సతీశ్ ప్రసాద్ సింగ్ 1968 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1వరకు... అంటే ఐదు రోజుల పాటు సీఎంగా పనిచేశారు. హర్యానాలో ఓం ప్రకాష్ చౌతాలా 1990 జులై 12 నుంచి 17వరకు ఆరు రోజుల పాటు పదవిలో ఉన్నారు. ఇక బీహార్ లో నితీష్ కుమార్ 8 రోజుల పాటు (2000 మార్చి 3 నుంచి 10 వరకు) సీఎంగా పనిచేశారు.
కర్ణాటకలోనే యడ్యూరప్ప 2007 నవంబర్ 12 నుంచి 19 వరకు ఎనిమిది రోజుల పాటు సీఎంగా పనిచేసి రాజీనామా చేశారు. మేఘాలయలో ఎస్సీ మరాక్ 1998, ఫిబ్రవరి 27 నుంచి మార్చి 10 వరకు 12 రోజుల పాటు సీఎంగా పనిచేశారు. హర్యానాలో ఓం ప్రకాష్ చౌతాలా 1991 మార్చి 21 నుంచి ఏప్రిల్ 6 వరకు 21 రోజుల పాటు సీఎం పదవిలో ఉండి రాజీనామా చేయాల్సి వచ్చింది.
తమిళనాడులో జానకీ రామచంద్రన్ 1988, జనవరి 7 నుంచి 30 వరకు... 24 రోజులు పదవిలో ఉండి రాజీనామా చేశారు. బీహార్ లో బీపీ మండల్ 31 రోజుల పాటు (1968 ఫిబ్రవరి 1 నుంచి మార్చి 2 వరకు) పదవిలో ఉండి దిగిపోయారు.