Andhra Pradesh: 'కర్నాటకం'పై జగన్ స్పందనిది!

  • రాజ్యాంగమే గెలిచింది
  • ఏపీలో నాలుగేళ్లుగా రాజ్యాంగ ఉల్లంఘనలు
  • 23 మందిని కొని అప్రజాస్వామివాదిగా మిగిలిన చంద్రబాబు

కర్ణాటకలో ఓ ఎపిసోడ్ ముగిసిందని, అక్కడ రాజ్యాంగమే గెలిచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టిన ఆయన, కర్ణాటకలో జరిగిన తప్పిదాలకన్నా ఘోరమైన రాజ్యాంగ ఉల్లంఘనలు ఏపీలో నాలుగేళ్లుగా జరుగుతున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలను ప్రస్తావించిన ఆయన, ఏపీలో చంద్రబాబు సంతలో పశువులను కొనుగోలు చేసినట్టుగా 23 మందిని కొని, తాను ఓ అప్రజాస్వామికవాదినని నిరూపించుకున్నారని, తాను కొన్న వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టడం ద్వారా రాజ్యాంగాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు.

అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ తాము అసెంబ్లీని బహిష్కరించినా ఇంతవరకూ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఓటుకు నోటు కేసును గుర్తు చేసిన జగన్, ఆడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయినా, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం అంటూ చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కర్ణాటకలో తప్పు చేశామని భావించిన బీజేపీ వెనకడుగు వేసిందని, ఏపీలో చంద్రబాబు తప్పు మీద తప్పు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News