Telangana: కర్ణాటకలో బీజేపీకి అవకాశమివ్వడం అప్రజాస్వామికం: కుంతియా
- తగినంత మెజార్టీ లేని బీజేపీ ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తుంది?
- ఈ విషయమై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఓ లేఖ రాశాం
- కోమటిరెడ్డి, సంపత్ ల వ్యవహారంలో హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు
కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీకి అవకాశమివ్వడం అప్రజాస్వామికమని తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి ఆర్. సి. కుంతియా మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తగినంత మెజార్టీ లేని బీజేపీ ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. ఈ విషయమై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఓ లేఖ రాశామని చెప్పారు.
ఈ సందర్భంగా తెలంగాణ గురించి ప్రస్తావిస్తూ, తమ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లను అసెంబ్లీ నుంచి బహిష్కరించడం తగదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయట్లేదని మండిపడ్డారు. కాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ, కర్ణాటకపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, మెజారిటీ లేని బీజేపీకి అధికారమివ్వడం అప్రజాస్వామికమని విమర్శించారు. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టామని చెప్పారు. కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ పార్టీ కలిసి అధికారం చేపట్టడం ప్రజాస్వామ్య పరంగా కరెక్టని అన్నారు.