Karnataka: కర్ణాటక గవర్నర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి: సిద్ధరామయ్య

  • సుప్రీంకోర్టు తీర్పుపై  సిద్ధరామయ్య హర్షం 
  • గవర్నర్ వజూభాయ్ వాలా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
  • బీజేపీకి అనుకూలంగా గవర్నర్ నిర్ణయాలు తీసుకున్నారు!

రేపు సాయంత్రం నాలుగు గంటలకు కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ బలపరీక్షను ఎదుర్కోవాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ సీఎం సిద్ధరామయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు నిచ్చిందని, కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.

అయితే, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన గవర్నర్ బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని, తాము ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని పత్రాలను సమర్పించినప్పటికీ ఆయన పట్టించుకోలేదని విమర్శించారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాల మేరకు నడుచుకుంటున్న గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, రేపు బలపరీక్షలో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. నిజంగా బలం ఉంటే సుప్రీంలో మరింత గడువు కావాలని బీజేపీ ఎందుకు కోరిందని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిందని అన్నారు. మణిపూర్, గోవా, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ న్యాయసూత్రాలను పాటించలేదని విమర్శించారు. కర్ణాటకలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదని, చట్టాలకు విరుద్ధంగా  బీజేపీకి గవర్నర్ అవకాశమిచ్చారని విమర్శించారు.

  • Loading...

More Telugu News