Chandrababu: మెజార్టీ ఒకరికి ఉంటే.. మరొకరికి అవకాశం ఇచ్చారు: చంద్రబాబు మండిపాటు

  • ప్రజాస్వామ్యబద్ధంగానే అన్ని వ్యవహారాలు జరగాలి
  • బీజేపీ ఆనాడు చెప్పిందేంటీ? ఈ రోజు చేస్తోందేంటీ?
  • ఇష్టానుసారంగా ప్రవర్తించడం మంచిది కాదు
  • వైసీపీలో ఉండే ఏ1, ఏ2లు నన్ను విమర్శిస్తున్నారు

ప్రజాస్వామ్యబద్ధంగానే అన్ని వ్యవహారాలు జరగాలని, కానీ కర్ణాటకలో అలా జరగడం లేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో నీరు-ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ... "కర్ణాటకలో రెండు పార్టీలు కలిసి మెజార్టీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే, మెజార్టీలేని ఇతర పార్టీకి అవకాశం ఇచ్చారు.

ఆ రోజు బీజేపీ చెప్పిన మాటలేంటీ? ఈ రోజు చేస్తోన్న పనులేంటీ? ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేస్తోందని అన్నారు. ఆ నాడు కాంగ్రెస్‌ పార్టీ వల్ల ఏపీలో ఎన్టీఆర్‌ నష్టపోయారు. 1984లో అప్రజాస్వామికంగా ఎన్టీఆర్‌ని పదవి నుంచి తీసేస్తే 30 రోజులు పోరాడి మళ్లీ ఆయనను సీఎం చేసిన ఘనత తెలుగు ప్రజలది, టీడీపీది. ఒక పద్ధతి ప్రకారం జరగాలి, ప్రజాస్వామికంగా ముందుకు వెళ్లాలి.

కేంద్రంలో అధికారంలో ఉన్నామని కర్ణాటకలో గానీ, మన రాష్ట్రంలోగానీ ఎక్కడైనా ఇష్టానుసారంగా ప్రవర్తించడం మంచిది కాదు. అదే సమయంలో అటు బీజేపీగానీ, ఇటు వైసీపీగానీ, ఇంకా కొంత మంది మాట్లాడుతున్నారు.. ఏపీలో పాలన బాగోలేదని... దేశంలోనే అత్యుత్తమ పాలనను ఇస్తోన్న ఘనత తెలుగుదేశం పార్టీదే.

నేను ఈ రోజు కష్టపడేది మీ కోసమే. వైసీపీలో ఉండే ఏ1, ఏ2లు నన్ను విమర్శిస్తున్నారు. నన్ను ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడుతున్నారు. ప్రజలను చైతన్య వంతులను చేసే ప్రయత్నం చేయాలి తప్ప అసత్యాలను ప్రచారం చేస్తూ తిరగకూడదు. ఏపీలో టీడీపీ మళ్లీ గెలవడం అనేది ముఖ్యమైన అంశం" అన్నారు.

  • Loading...

More Telugu News