Godavari: ఆ మేఘాలే లాంచీని ముంచేశాయి!

  • బోటును ముంచేసిన క్యుములోనింబస్ మేఘాలు
  • మేఘం పూర్తిగా కరిగే వరకు బీభత్సం
  • 90 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు

గోదావరి నదిలో జరిగిన లాంచీ ప్రమాద ఘటనకు కారణం ఏంటో తెలసింది. లాంచీ మునకకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడం వల్లే లాంచీ అదుపుతప్పి మునిగిపోయిందని కాకినాడకు చెందిన వాతావరణ విభాగం అధికారి ఒకరు వివరించారు.

క్యుములోనింబస్ మేఘాల ప్రభావం రెండుమూడు కిలోమీటర్ల పరిధిలో ఉంటుందన్న ఆయన, ఆ సమయంలో 30 నాటికల్ మైళ్ల వేగంతో పెను గాలులు వీస్తాయని పేర్కొన్నారు. మేఘం పూర్తిగా  కరిగిపోయే వరకు వర్షం, భారీ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు ఉంటాయన్నారు. ఆ సమయంలో ప్రయాణాలను విరమించుకోవడమే మంచిదన్నారు.

వాతావరణ శాఖ తరచూ హెచ్చరికలు చేస్తూ ఆ సమాచారం గోదావరి తీరంలోని బోట్ల నిర్వాహకులకు అందుబాటులో ఉంచకపోవడమే ప్రమాదాలకు కారణం అవుతోందన్నారు. విమాన ప్రయాణాల సమయంలో ప్రమాదకరమైన గాలులు వీస్తే హెచ్చరించి, విమానాన్ని దారి మళ్లించే అవకాశం ఉంటుందని, కానీ ఇక్కడ అటువంటి వ్యవస్థ లేదని తెలిపారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాపికొండల యాత్ర కోసం తిరుగుతున్న బోట్ల విషయంలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ప్రమాదాల అడ్డుకట్టకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతోపాటు బోట్లలో మెడికల్ కిట్లు, లైఫ్ జాకెట్లు సరిపడా ఉంచడం వల్ల కూడా ప్రాణ నష్టాన్ని నివారించవచ్చన్నారు. అలాగే, నాటు పడవల్లో పిడుగు నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారి సూచించారు.

  • Loading...

More Telugu News