Karnataka: కర్ణాటక రాజకీయం: అర్ధరాత్రి సుప్రీంను ఆశ్రయించిన కాంగ్రెస్.. గవర్నర్‌ను అడ్డుకోలేమన్న ధర్మాసనం!

  • కర్ణాటకలో మలుపులు తిరుగుతున్న రాజకీయం
  • అర్ధరాత్రి సుప్రీం తలుపు తట్టిన కాంగ్రెస్
  • తెల్లవారుజామున 3:20 గంటల వరకు వాదనలు

కర్ణాటక రాజకీయాలు సినిమా సస్పెన్స్‌ను మించి సాగుతున్నాయి. ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకున్న బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆ పార్టీ శాసన సభాపక్ష నేత యడ్యూరప్పను గవర్నర్ వజుభాయ్ వాలా ఆహ్వానించి బలనిరూపణకు 15 రోజుల గడువు ఇచ్చారు. అంతకుముందు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతూ, జాబితాదారుల మద్దతు సమర్పించిన కాంగ్రెస్‌-జేడీఎస్‌లకు చుక్కెదురైంది.

ప్రభుత్వ ఏర్పాటుకు ఎత్తులు, పైఎత్తులు సాగుతుండగానే బుధవారం అర్ధరాత్రి ఒక్కసారిగా పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. గవర్నర్ నిర్ణయంపై భగ్గుమన్న కాంగ్రెస్ అర్ధరాత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాత్రి 11:47 గంటలకు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని అప్పటికప్పుడే విచారించాలని, సుప్రీం జోక్యం అనివార్యమని కాంగ్రెస్ అభ్యర్థించింది. కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ మనుసింఘ్వీ, వివేక్‌ తనఖా, పార్టీ లీగల్‌సెల్‌ లాయర్లు రాత్రి 12:28 గంటల సమయంలో చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నివాసానికి  చేరుకున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థనపై సీజే తొలుత విముఖత ప్రదర్శించినా.. కర్ణాటకలో గురువారం అనైతిక ప్రభుత్వం కొలువుదీరబోతోందని, తక్షణం దానిని ఆపాలన్న కాంగ్రెస్ అభ్యర్థనతో అంగీకరించారు. అర్ధరాత్రి దాటాక 1:45 గంటలకు ఆరో నంబరు కోర్టులో విచారణకు ఆదేశాలు జారీ చేశారు. జస్టిస్‌ ఏకే సిక్రీ నేతృత్వంలో జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డేలతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనాన్ని అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు.  ఈ కేసులో కేంద్రం తరఫున వాదనలు వినిపించడానికి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి రంగంలోకి దిగారు.

‘గవర్నర్ విచక్షణ’  అనే ప్రాతిపదికన ప్రజా తీర్పును పక్కన పెట్టేసి గవర్నర్ తనకు నచ్చినట్టు నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటూ కాంగ్రెస్ నేత సింఘ్వి బృందం తన వాదనలను కోర్టుకు సవివరంగా అందజేసింది. 116 మంది సభ్యుల బలమున్న కాంగ్రెస్-జేడీఎస్‌లను కాదని, 104 మంది సభ్యుల బలమున్న బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా ఆహ్వానిస్తారని అందులో ప్రశ్నించారు. గవర్నర్ నిర్ణయం ఏకపక్షంగా ఉండడంతోపాటు రాజ్యాంగ విరుద్ధంగానూ ఉందని ఆరోపించారు. మెజారిటీ కూటమి నేత కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

కాంగ్రెస్ పిటిషన్‌పై తెల్లవారుజామున 3:20 గంటల వరకు వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా న్యాయవాదుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. కాంగ్రెస్ అభ్యంతరాలపై కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుంటూ గవర్నర్‌కు ఉత్తర్వులు ఇవ్వజాలమని తేల్చి చెప్పింది. అతిపెద్ద పార్టీకి అవకాశం ఇవ్వడం సంప్రదాయమని పేర్కొంది. ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీని పిలవకుండా గవర్నర్‌ను కోర్టు అడ్డుకోలేదని తెలిపింది. అదే జరిగితే రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందని పేర్కొంది.

  • Loading...

More Telugu News