Pawan Kalyan: శెట్టిపల్లి భూములను లాక్కోవాలని చూస్తే పోరాటం చేస్తాం: ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ హెచ్చరిక
- చిత్తూరు జిల్లా శెట్టిపల్లిలో పర్యటించిన పవన్
- రైతులతో ముఖాముఖి మాట్లాడిన ‘జనసేన’ అధినేత
- శెట్టిపల్లిలో భూసమీకరణ చేస్తే ప్రజలే ఎదురు తిరగాలి
ప్రభుత్వానికి మానవతా దృష్టి లేకుంటే ప్రజలు ఇబ్బంది పడతారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. చిత్తూరు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన ఐదో రోజుకు చేరుకుంది. నిన్న చిత్తూరు రోడ్డు విస్తరణ బాధితులను ఆయన పరామర్శించిన విషయం తెలిసిందే. ఈరోజు శెట్టిపల్లికి వెళ్లారు. రైతులతో ముఖాముఖి మాట్లాడారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, పైడిపల్లిలో ఇదే తరహా భూములకు పట్టాలిచ్చి శెట్టిపల్లికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. శెట్టిపల్లిలో భూసమీకరణ చేస్తే ప్రజలే ఎదురు తిరగాలని పవన్ వ్యాఖ్యానించారు. భూసేకరణ విధానంలో మార్పు తీసుకురావాలని, శెట్టిపల్లి భూములను సమీకరించే ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని సూచించారు.
ప్రభుత్వం శెట్టిపల్లి భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏపీలో రైతు రుణమాఫీ పథకంపై విమర్శలు గుప్పించారు. ఏపీలో రైతు రుణ మాఫీ వ్యవహారం ఎలా ఉందంటే.. బిందెడు నీళ్లు ఆశ చూపి మూడు స్పూన్ల నీళ్లు తాగించినట్టుగా ఉందని విమర్శించారు.