Karnataka: ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నిస్తోంది!: రఘువీరారెడ్డి
- బీజేపీ అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోంది
- కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ అవకాశమివ్వాలి
- మోదీ, అమిత్ షాలు నియంతృత్వంతో వ్యవహరిస్తున్నారు
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన జేడీఎస్ ను చీల్చి.. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. బీజేపీ అప్రజాస్వామిక చర్యలకు పాల్పడటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తోందని విమర్శించారు.
మోదీ, అమిత్ షాలు నియంతృత్వంతో వ్యవహరిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలుపుతున్నారని మండిపడ్డారు. బీజేపీ దురాక్రమణ, దురహంకారాన్ని నిలువరించాలనే ఉద్దేశంతోనే జేడీఎస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుందని అన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కర్ణాటక గవర్నర్ అవకాశమివ్వాలని కోరారు.