Andhra Pradesh: నకిలీ విత్తనాలతో రైతులను మోసగిస్తే కఠిన చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు

  • నీరు-ప్రగతి, వ్యవసాయంపై టెలికాన్ఫరెన్స్  
  • నాసిరకం పత్తి విత్తనాలు మార్కెట్ లోకి రాకుండా కట్టడి చేయాలి
  • గుజరాత్ నుంచి అనుమతిలేని పత్తివిత్తనాలు వస్తున్నాయి
  • అధికారులు అప్రమత్తంగా ఉండాలి

నకిలీ విత్తనాలతో రైతులను మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై ఈ రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖలు, రియల్ టైం గవర్నెన్స్ ఉన్నతాధికారులు, సీఎంవో కార్యదర్శులు, వివిధ జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, నాసిరకం పత్తి విత్తనాలు మార్కెట్ లోకి రాకుండా కట్టడి చేయాలని, నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గుజరాత్ నుంచి అనుమతిలేని పత్తి విత్తనాలు మన రాష్ట్రానికి వస్తున్నాయని, ఈ విషయమై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రైతుల్లో అవగాహన పెంచాలని ఆదేశించారు. ఈ సీజన్ లో నెల్లూరు జిల్లాలో పంటల ఉత్పాదకత గణనీయంగా పెరిగిందని, మిగిలిన జిల్లాలు కూడా నెల్లూరు మోడల్ ను అధ్యయనం చేయాలని, ఇక్కడ వాడిన విత్తనాలు, మేలైన పద్ధతులపై రైతులను చైతన్యపరచాలని సూచించారు.

వర్మీ కంపోస్ట్ ధరలు రైతులకు అందుబాటులో ఉంచాలి 


వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి 207 టన్నులు సిద్ధంగా ఉందని చంద్రబాబు చెప్పారు. వర్మీ తయారీకి 70 వేల టన్నుల డంగ్ సిద్ధంగా ఉందని, రసాయన ఎరువుల వాడకం పూర్తిగా తగ్గాలని, సేంద్రీయ ఎరువుల వినియోగం పెరగాలని సూచించారు. మన పంట ఉత్పత్తుల నాణ్యత పెరగాలని, నాణ్యమైన వ్యవసాయ దిగుబడులకు ఏపీ చిరునామా కావాలని కోరారు. వర్మీ కంపోస్ట్ ధరలు రైతులకు అందుబాటులో ఉంచాలని, వాటి అమ్మకాలపై వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని, ఏ ఊళ్లో వర్మీ కంపోస్ట్ ఆ ఊళ్లో రైతులకే విక్రయించాలని ఆదేశించారు. ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిన జల సంరక్షణ పనులు సత్ఫలితాలు ఇచ్చాయని, వర్షపాతం లోటు ఉన్నా సాగునీటిని ఇవ్వగలిగామని, ఖరీఫ్ సీజన్ కు రైతులకు కావాల్సిన ఇన్ పుట్స్ సిద్ధం చేయాలని, విత్తనాలు, ఎరువులు, రుణాలు కొరత లేకుండా అందించాలని అన్నారు.

రోజువారీ కూలీల హాజరు 23 లక్షలకు చేరాలి

వ్యవసాయ పనులు లేవు కనుక ఉపాధి పనులు ముమ్మరం చేయాలని, వ్యవసాయ సీజన్ ప్రారంభమయ్యే లోపు నరేగా పనులు గరిష్టంగా జరగాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ నెలలో రూ.1,000 కోట్లు విలువైన నరేగా పనులు చేయాలని, రోజువారీ కూలీల హాజరు 23 లక్షలకు చేరాలని, రాబోయే 21 రోజుల్లో లేబర్ టర్నోవర్ పెరగాలని ఆదేశించారు. 525 గ్రామాల్లో తాగునీటి రవాణా జరుగుతోంది. ఈ గ్రామాలలో తాగునీటి పథకాల పనులు వెంటనే పూర్తి చేయాలని, జల సంరక్షణ పనులు ముమ్మరం చేయాలని, పట్టణ ప్రాంతాలలో తాగునీటి కొరత లేకుండా చేయాలని అన్నారు.

గిరిజన తండాలలో రూ.105 కోట్లతో 1,017పనులు వేగవంతం చేయాలని, పెండింగ్ లో ఉన్న 531 పనులు త్వరితగతిన చేపట్టాలని, మరో 8వేల మరుగుదొడ్లు నిర్మిస్తే 100% ఓడిఎఫ్ పూర్తి అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖలో మరుగుదొడ్ల నిర్మాణం వేగం పుంజుకోవాలని, ఓడిఎఫ్ ప్లస్ పనులకు అన్నిజిల్లాలు సంసిద్ధం కావాలని, రూ.900 కోట్ల నిధులను సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. డిసెంబర్ కల్లా అన్ని గ్రామాలు స్వచ్ఛగ్రామాలు కావాలని ఆదేశించారు. ఓడిఎఫ్ కాగానే ఓడిఎఫ్ ప్లస్ ప్రారంభించాలని చెప్పారు.

కేంద్రంతో విభేదించిన మన రాష్ట్రం కూడా అభివృద్ధిలో ముందంజలో ఉండాలి

కేంద్రంతో విభేదించినా తమిళనాడు, కేరళ రాష్ట్రాలు దేశంలో ముందంజలో ఉన్న విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు. అదే విధంగా మన రాష్ట్రం కూడా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో ముందుండాలని  అన్నారు. మనం చేసే పనులు చరిత్రలో నిలిచిపోతాయని, భావితరాలు మన కృషిని మరిచిపోవని, విభజన వల్ల పొరుగు రాష్ట్రాల కన్నా దిగువన ఉన్నామని, స్వయంకృషితో మన స్థాయిని మెరుగు పరుచుకుంటున్నామని చెప్పారు. ప్రాథమిక విద్యలో 3వ స్థానంలో ఉన్నామని, ఐఐటిలో 12% ఫలితాలు మన రాష్ట్రనికే దక్కుతున్నాయని, దేశంలోనే విద్యారంగంలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉండాలని ఆకాక్షించారు.  

పేదరికంలేని రాష్ట్రంగా ఏపీని రూపొందించడమే నా సంకల్పం

మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ లో మనదేశం ఏ స్థాయిలో ఉందో పరిశీలించాలని, పదేళ్ళలో దేశంలో పేదరికం 51% నుంచి 21%కు తగ్గిందని చంద్రబాబు అన్నారు. దక్షిణ భారత రాష్ట్రాలలో పేదరికం స్థాయి 9 శాతానికి వచ్చిందని, కేరళలో పేదరికం 1%, తమిళనాడులో 6%, కర్ణాటకలో 11%, ,ఆంధ్రప్రదేశ్ 13%, తెలంగాణలో 14 శాతం ఉందని అన్నారు. గుజరాత్ (16%), పశ్చిమ బెంగాల్ (17%) కన్నా ఏపీ మెరుగ్గా ఉందని, తొలి ఏడాదిలో చేపట్టిన పథకాల వల్లే ఈ స్థాయి వచ్చిందని, మిగిలిన మూడేళ్లలో మరిన్ని పథకాలు అమలు చేయడం వల్ల మరింతగా మన ర్యాంకు పెరిగి ఉంటుందని అన్నారు. దక్షిణాదిలో కూడా ఆంధ్రప్రదేశ్ మరింత మెరుగుపడాలని, పేదరికంలేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపొందాలన్నదే తన సంకల్పమని, అందుకోసమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ ప్రజల ఆదాయాల పెరుగుదలకు అనేక చర్యలు చేపట్టామని అన్నారు. సబ్ ప్లాన్ లకు బడ్జెట్ గణనీయంగా పెంచామని, ప్రతి కుటుంబం రాబడి నెలకు కనీసం రూ.10 వేలు ఉండేలా ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.

పిడుగుపాటు సమాచారంపై గ్రామాల్లో దండోరా వేయించాలి  

రాష్ట్రంలో పిడుగుపాట్లకు 13 మంది మృతి చెందడంపై చంద్రబాబు ఆరా తీశారు. పిడుగుల సమాచారం ముందే వస్తున్నా ప్రాణనష్టం జరగడంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. పిడుగుపాట్ల సమాచారం మరింతగా విశ్లేషించాలని, ఆధునిక సాంకేతికతతో అధ్యయనం చేయాలని అన్నారు. ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని, పిడుగుపాట్ల సమాచారంపై ముందే గ్రామాలలో దండోరా వేయించాలని సూచించారు. గ్రామాలకు సమాచారం ముందే చేరేలా కమ్యూనికేషన్స్ మెరుగుపరచాలని సూచించారు.

  • Loading...

More Telugu News