Hyderabad: డ్రంకెన్ డ్రైవ్ ను తప్పించుకునేందుకు... ఏటీఎంలో దుస్తులు మార్చుకున్న ఇద్దరమ్మాయిలు, ఏమీ చేయలేకపోయిన పోలీసులు!
- హైదరాబాద్, జూబ్లీహిల్స్ లో ఘటన
- కారును రోడ్డు పక్కన ఆపి డ్రస్ చేంజ్
- రాంగ్ పార్కింగ్ జరిమానాతో సరిపెట్టిన పోలీసులు
- డ్రైవింగ్ సీటులో ఉంటేనే తనిఖీలు ఉంటాయన్న ట్రాఫిక్ పోలీసులు
పూటుగా మద్యం తాగి, ఆపై పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకోవాలా? అయితే, హైదరాబాద్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో తమ తెలివితేటలను చూపించిన ఈ ఇద్దరమ్మాయిల గురించి తెలుసుకోవాల్సిందే. ఇంతకీ అసలేం జరిగిందంటే... నల్ల టీషర్టు ధరించిన ఓ యువతి పూటుగా తాగి, కాస్తంత తక్కువగా తాగిన తన మరో స్నేహితురాలితో కలసి ఖరీదైన కారులో జూబ్లీహిల్స్ లో ప్రయాణిస్తున్న వేళ, దూరంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను నిర్వహిస్తున్న పోలీసులను చూసింది. వెంటనే కారును పక్కగా ఆపి, ఇద్దరూ కిందకు దిగారు.
ఓ కారు ఆగిందన్న విషయాన్ని చూసిన పోలీసులు, బ్లాక్ టీషర్ట్ ధరించిన అమ్మాయి కారు నడిపిందని గమనించారు కూడా. ఆపై కారు దగ్గరకు వారు చేరుకునేలోగానే, పక్కనే ఉన్న ఏటీఎంలోకి వెళ్లిన ఇద్దరు అమ్మాయిలూ, తమ దుస్తులను పరస్పరం మార్చుకున్నారు. అక్కడి నుంచే మద్యం తాగని తమ స్నేహితుడిని పిలిపించుకున్నారు. అతను వచ్చే సమయానికి నిమిషం ముందు వీరిద్దరూ బయటకు వచ్చారు.
వీరిని చూసిన పోలీసులు, కారును రోడ్డుపై ఎందుకు ఆపారని ప్రశ్నిస్తుండగానే, వీరి స్నేహితుడు వచ్చి, కారు తనదని చెప్పాడు. అతనికి డ్రంకెన్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా, బీఏసీ సున్నాగా చూపించింది. దీంతో చేసేదేమీ లేక రాంగ్ పార్కింగ్ కింద ఫైన్ విధించి పోలీసులు వెళ్లిపోయారు. ఇక ఈ ఘటనపై స్పందించిన ట్రాఫిక్ సీఐ కావేటి శ్రీనివాసులు, కారులో డ్రైవింగ్ సీటులో ఉన్నవారికి మాత్రమే డ్రంకెన్ డ్రైవ్ పరీక్ష చేయాల్సివుంటుందని, తాము చూసిన సమయానికి కారు డ్రైవింగ్ సీటులో ఎవరూ కనిపించలేదని తెలిపారు. ఇక అక్కడే ఉన్న చాలామంది, ఏటీఎంలోని సీసీటీవీ ఫుటేజ్ ని చూస్తే, వారి నాటకం ఎలా రక్తి కట్టిందో తెలిసిపోతుందని గుసగుసలాడటం కొసమెరుపు.