Yerravelli: ఏం బాపురెడ్డీ... నా వేలిముద్ర కోసం వచ్చావా?: కేసీఆర్
- ఎరువులు కావాలంటే వేలిముద్ర వేయాల్సిందే
- ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్ పంటల కోసం ఎరువులు కొనే కేసీఆర్
- ఆయన వేలిముద్ర కోసం వచ్చిన ఫర్టిలైజర్స్ యజమాని
రోజూ ఎన్నో దస్త్రాలపై సంతకం చేసే కేసీఆర్ వేలిముద్ర వేయడం ఏంటని అనుకుంటున్నారా? అవును నిజమే. కేసీఆర్ వేలిముద్ర వేయాల్సిందే. ఆసక్తికరమైన కేసీఆర్ వేలిముద్ర గురించి మరింతగా తెలుసుకోవాలనుకుంటే ఇది చదవాల్సిందే...
ఎర్రవల్లిలో కేసీఆర్ కు ఓ ఫామ్ హౌస్ ఉందన్న సంగతి తెలుసుగా? అక్కడాయన స్వయంగా పంటలు పండిస్తారు కూడా. ఇక ఆ పంటలకు కావాల్సిన ఎరువులను తెప్పించుకోవాలంటే పీవోఎస్ మిషన్ లో కేసీఆర్ స్వయంగా వేలిముద్ర వేయాల్సిందే. ఆదివారం నాడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేసీఆర్ రాగా, అక్కడి ఎరువులు, పురుగుమందుల దుకాణం యజమాని ఏనుగు బాపురెడ్డి అక్కడికి వచ్చారు.
ఇప్పటికే ఎరువుల పంపిణీ కేంద్రానికి, రైతుల ఆధార్ కార్డులతో లింక్ పెట్టి, పీవోఎస్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేసీఆర్ వ్యతిరేకించారు. అయినా కేంద్రం మెట్టు దిగలేదు. ఎరువులు కావాలంటే, ఎవరైనా స్వయంగా వెళ్లి వేలిముద్ర వేసి తీసుకోవాల్సిందే. ఇక ఇదే విషయాన్ని పీవోఎస్ మిషన్ ను తన వద్దకు తెచ్చిన బాపురెడ్డి వద్ద ప్రస్తావించిన కేసీఆర్, మండలంలో ఎరువుల సరఫరాపై వివరాలు అడిగారు. కేంద్రం పెట్టిన నిబంధనల కారణంగానే ఇలా జరుగుతోందని, ఎంతో మంది రైతులకు ఇది ఇబ్బందికరమేనని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు.