Hyderabad: హైదరాబాద్ ఎస్‌బీఐ ఏటీఎం నుంచి చిరిగిన, ఇంకు మరకలున్న రూ.2 వేల నోట్లు.. లబోదిబోమన్న బాధితుడు!
- రూ.పది వేలు డ్రా చేసిన వినియోగదారుడు
- చిరిగిన, ఇంకు మరకలున్న నోట్లు వచ్చిన వైనం
- ఎస్‌బీఐ బ్రాంచ్‌లో మార్చుకోమంటూ స్టేట్‌బ్యాంకు ట్వీట్
హైదరాబాద్‌లోని ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి చిరిగిన, మరకలున్న రూ.2వేల నోట్లు వస్తున్నాయి. శుక్రవారం రాత్రి వనస్థలిపురంలోని ఓ ఎస్‌బీఐ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసిన ఓ వ్యాపారి చిరిగిన, పూర్తిగా నలిగిన, మరకలున్న నోట్లు రావడం చూసి అవాక్కయ్యాడు. అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుపై ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఫిర్యాదును సోమవారం భారతీయ స్టేట్ బ్యాంకుకు పంపి సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరనున్నట్టు చెప్పారు.
వనస్థలిపురం బ్రాంచ్ ఏటీఎం నుంచి శ్రీకర్ ఆదిత్య అనే వ్యక్తి రూ.10 వేలు డ్రా చేశారు. ‘‘నోట్లు చూసి నేను ఆశ్చర్యపోయాను. రెండు నోట్లు పూర్తిగా చిరిగిపోయి ఉన్నాయి. రెండు నోట్లపై ఇంకు మరకలు ఉన్నాయి. ఒక నోటుపై స్టిక్కర్లు వేసి ఉన్నాయి. నోట్లపై కొన్ని నంబర్లు కూడా మిస్సయ్యాయి’’ అని పేర్కొన్నారు. వాటిలో ఒక్కటి కూడా ఉపయోగించడానికి వీల్లేకుండా ఉందని శ్రీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నోట్లను వెంటనే పక్కనే ఉన్న డిపాజిట్ మెషిన్లో డిపాజిట్ చేసేందుకు ప్రయత్నిస్తే మిషన్ వాటిని తీసుకోలేదని వివరించారు. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చానని పేర్కొన్నారు.
ఏటీఎంకి డబ్బులు పంపించే ముందు నోట్ల క్వాలిటీని, ప్రామాణికతను పూర్తిగా పరీక్షిస్తామని, ఒకవేళ చిరిగిన నోట్లు వచ్చాయంటే నిర్లక్ష్యం వల్లే అలా జరిగి ఉంటుందంటూ ఆదిత్య ట్వీట్‌కు ఎస్‌బీఐ రిప్లై ఇచ్చింది. చిరిగిన నోట్లను ఏదైనా ఎస్‌బీఐ బ్రాంచ్‌లో మార్చుకోవాలని సూచించింది.