Tollywood: ‘హోదా’ సాధనకు అగ్ర హీరోలందరూ కదలాలి: నిర్మాత యలమంచి రవిచంద్
- ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో భాగస్వామి అయిన రవిచంద్
- విజయవాడలోని పున్నమిఘాట్ లో జలదీక్ష
- హీరో లెవ్వరూ ఆందోళనలకు దిగాల్సిన అవసరం లేదు
- ప్రతి నెలా రెండో ఆదివారం దీక్ష చేస్తే చాలు
ఏపీకి ప్రత్యేక హోదా పోరాటంలో సినీ నిర్మాత యలమంచి రవిచంద్ భాగస్వామి అయ్యారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని పున్నమి ఘాట్ లో జలదీక్షకు దిగారు. ‘హోదా’సాధన విషయమై ఉద్యమించేందుకు సినీ పరిశ్రమ ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, సినీ పరిశ్రమకు ఏదైనా కష్టమొస్తే వెంటనే సమావేశం ఏర్పాటు చేసుకునే సినీ పెద్దలు ‘హోదా’ విషయమై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
తమిళ హీరోలను చూసైనా మన హీరోలు బుద్ధి తెచ్చుకోవాలని, ఒక వేదిక ఏర్పాటు చేసుకుని పోరాడాలని కోరారు. ప్రతి ఏటా తెలుగు ప్రజల నుంచి వెయ్యి కోట్ల రూపాయల వరకు సినీ పరిశ్రమ తీసుకుంటుందని, మరి, ఏపీ ప్రజలకు కష్టమొచ్చినప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. జల్లికట్టు, రైతుల సమస్యల గురించి తమిళ సినీ పరిశ్రమ ఏ విధంగా పోరాడిందో అందరికీ తెలుసని, ఆ మాదిరిగా మన హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఎందుకు స్పందించరు? అని ప్రశ్నించారు.
ఈ విషయమై స్పందించమని కోరుతూ ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మా అసోసియేషన్ కు తాను ఇప్పటికే లేఖలు రాశానని, ఈ లేఖలను చూసి అక్కడి పెద్దలు నవ్వుకున్నారని తనకు సమాచారం ఉందని చెప్పారు. ఈ విషయం తెలిసి తనకు చాలా బాధ కలిగిందని, సినీ పరిశ్రమ పెద్దలు దిగొచ్చే వరకూ ఈ పోరాటం చేయాలని నిశ్చయించుకున్నట్టు చెప్పారు.
సినీ పరిశ్రమలోని అగ్ర హీరోలు నాగార్జున, వెంకటేష్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రాంచరణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, పెద్ద నిర్మాతలు ముందుకు రావాలని కోరారు. ‘హోదా’ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు హీరో లెవ్వరూ ఆందోళనలకు దిగాల్సిన అవసరం లేదని, ప్రతి నెలా రెండో ఆదివారం దీక్ష చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆరు నెలల పాటు పోరాటం చేద్దామని, అలా చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే.. స్ట్రయిక్ చేద్దామని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, హామీల అమలు విషయమై తెలంగాణ ప్రభుత్వమే సపోర్టు చేసిందని, పక్క రాష్ట్రాల్లో హీరోలకు ఉన్న బుద్ధిజ్ఞానం కూడా మీకు లేదా? అంటూ రవిచంద్ మండిపడ్డారు.