Chidambaram: చిదంబరం కుటుంబానికి షాక్.. నాలుగు చార్జిషీట్లు దాఖలు చేసిన ఐటీ

  • నల్లధనం నిరోధక చట్టం కింద కేసులు నమోదు
  • విదేశాల్లోని ఆస్తులు ప్రస్తావించలేదన్న ఐటీ
  • భార్య, కొడుకు, కోడలుపై చార్జిషీట్లు

కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం కుటుంబం మొత్తానికి ఆదాయపన్ను శాఖ షాకిచ్చింది. విదేశాల్లోని ఆస్తుల వివరాలను వెల్లడించని నేరంపై చిదంబరం భార్య నళిని, కుమారుడు కార్తి, కోడలు శ్రీనిధి‌లపై నల్లధనం నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసిన ఐటీ మొత్తం నాలుగు అభియోగపత్రాలను దాఖలు చేసింది.

2015లో అమల్లోకి వచ్చిన ఈ చట్టంలోని 50వ నిబంధన కింద చార్జిషీట్లు దాఖలు చేసింది. విదేశాల్లో ఆస్తులు కొనడంతోపాటు ఐటీ రిటర్న్స్‌లో వాటిని ప్రస్తావించకపోవడాన్ని ఆదాయపన్ను శాఖ చార్జిషీట్లలో ప్రస్తావించింది. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జిలో రూ.3.57 కోట్లు, మరో చోట రూ.80 లక్షలు, అమెరికాలో రూ.3.28 కోట్ల విలువైన ఇళ్లను కొనుగోలు చేసిన చిదంబరం కుటుంబ సభ్యులు వాటి గురించి ఐటీ రిటర్న్స్‌లో తెలపలేదని పేర్కొంది.

చిదంబరం కుమారుడు కార్తి యజమానిగా ఉన్న చెస్ గ్లోబల్ అడ్వైజరీ కూడా ఈ ఆస్తుల గురించి ప్రస్తావించలేదని ఐటీ శాఖ వివరించింది. నల్లధనం నిరోధక చట్టం అమల్లోకి రాకముందు వరకు 1961 ఆదాయపన్ను శాఖ చట్టం కింద ఇటువంటి కేసులను విచారించేవారు. 2015లో కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం కింద పదేళ్ల వరకు జైలు శిక్ష, మొత్తం ఆస్తుల విలువ మీద 120 శాతం వరకు జరిమానా విధిస్తారు.

  • Loading...

More Telugu News