Rajasthan Royals: సెహ్వాగ్ ను నిలదీసిన ప్రీతీ జింటా.. పంజాబ్ జట్టుకు సెహ్వాగ్ ఇక దూరం?
- రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఓటమి
- వన్ డౌన్ లో వెళ్లి డక్కౌట్ అయిన కెప్టెన్ అశ్విన్
- అందరిముందూ సెహ్వాగ్ ను నిలదీసిన ఫ్రాంచైజీ యజమాని ప్రీతీ జింటా
రెండు రోజుల క్రితం కీలకమైన మ్యాచ్ లో తన జట్టుతో పోలిస్తే అన్ని విభాగాల్లో బలహీనంగా కనిపించే రాజస్థాన్ రాయల్స్ పై ఓడిపోయిన నేపథ్యంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని జట్టు మార్గ నిర్దేశకుడు, మాజీ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ పై యజమాని ప్రీతి జింటా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ మ్యాచ్ లో పెద్దగా కష్టసాధ్యం కాని 158 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ జట్టు చేరుకోలేక చతికిలపడగా, అసలు గేమ్ లో గెలిచేందుకు ఏ విధమైన ప్రణాళికలు వేశారని సెహ్వాగ్ ను ప్రీతి నిలదీసినట్టు తెలుస్తోంది.
ప్రీతీ జింటా, నెస్ వాడియా, మోహిత్ బుర్మన్ లు యజమానులుగా ఉన్న జట్టుకు ఐదేళ్లపాటు మెంటార్ గా సేవలందించేందుకు సెహ్వాగ్ కాంట్రాక్టు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. టైటిల్ సాధించేంత బలమైన జట్లలో ఒకటిగా ఐపీఎల్ - 2018 ప్రారంభానికి ముందు అంచనాలున్న జట్టు, ఆ స్థాయి ప్రదర్శన కనబరచడంలో విఫలమవుతోందన్న సంగతి తెలిసిందే. ఇక సరైన ప్లాన్, టాక్టిక్స్ లేకుండా ఆడుతున్నందునే తన టీమ్ విఫలమవుతోందని ప్రీతి భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా వన్ డౌన్ లో దిగి పరుగులేమీ చేయకుండా వెనక్కు రావడంపైనా ప్రీతి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కరుణ్ నాయర్, మనోజ్ తివారీలను పక్కనబెట్టి, వన్ డౌన్ లో అశ్విన్ ను పంపాలన్న నిర్ణయం సెహ్వాగ్ దేనని తెలుసుకున్న ప్రీతి, ఈ విషయంలో కాస్తంత కటువుగానే మాట్లాడినట్టు ఆ సమయంలో అక్కడే ఉన్న వారు వెల్లడించినట్టు 'మిర్రర్' వెల్లడించింది.
ఓటమి తరువాత ఆటగాళ్లు డ్రస్సింగ్ రూముకు వెళ్లే క్రమంలోనే సెహ్వాగ్, ప్రీతిల మధ్య మాటల యుద్ధం జరిగిందని సమాచారం. దీంతో మనస్తాపం చెందిన సెహ్వాగ్, పంజాబ్ ఫ్రాంచైజీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి వుంది.