Rahul Gandhi: అది మోదీ సమస్య... నా సమస్య కాదు: రాహుల్ గాంధీ
- నన్ను చూస్తే ఆయనకు కోపం వస్తోంది
- నా తల్లి భారతీయులకు మించి దేశభక్తి కలిగిన వారు
- ఆమె ఎన్నో త్యాగాలు చేసింది
ప్రధాని మోదీ ప్రతి ఒక్కరి పట్ల కోపం తెచ్చుకుంటారని, తన ఒక్కరి విషయంలోనే కాదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 12న జరగనుండగా, ప్రచారానికి ఈ రోజే ఆఖరు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... ‘‘నేను కోపం తెప్పించే కిరణం లాంటి వాడిని. నన్ను చూస్తే కోపం వస్తోంది. అది నా సమస్య కాదు. అది అతని (మోదీ) సమస్య’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ప్రధాని కావాలన్న కోరిక విషయమై తనను మోదీ విమర్శించారని, అది కేవలం ప్రజల దృష్టిని మరల్చడానికేనని రాహుల్ గాంధీ అన్నారు. కర్ణాటక ఎన్నికలు రాహుల్ గాంధీ గురించి జరగడం లేదంటూ తనపై దాడిని తప్పుబట్టారు. నా తల్లి ఓ ఇటాలియన్. నేను చూసే ఎంతో మంది భారతీయులకు మించి ఆమె భారతీయత కలిగిన వ్యక్తి. ఆమె ఎంతో త్యాగం చేశారు’’ అని తన మాతృమూర్తిని మెచ్చుకున్నారు. గత 15 ఏళ్ల కాలంలో తాను ఆలయాలు, మసీదులు, గురుద్వారాలకు వెళ్లానని, ఇది బీజేపీకి నచ్చడం లేదని విమర్శించారు. హిందు అనే పదానికి వారికి సరైన అర్థం తెలియదన్నారు.