Rajanikant: ఎవరేం చెప్పినా నా దారిలోనే వెళతాను: రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు
- ఏ సినిమా చేసినా ఇదే లాస్ట్ అంటారు
- ఎవరేమన్నా 40 ఏళ్లుగా నడుస్తూనే ఉన్నాను
- దేవుడు మార్గం చూపుతున్నాడంతే!
తాను మరో సినిమా చేసిన ప్రతిసారీ, ఇక రజనీకాంత్ పని అయిపోయిందని చాలా మంది అంటుంటారని, గత నాలుగు దశాబ్దాలుగా ఎంతోమంది ఇదే మాటన్నా తాను పట్టించుకోలేదని సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యానించారు. గత రాత్రి ఆయన కొత్త చిత్రం 'కాలా' ఆడియో వేడుక చెన్నయ్ లో జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ఈ గుర్రం ఇంకా పరుగులు పెడుతోందేమిటి అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి నేను పరుగులేమీ పెట్టడం లేదు. నడుస్తున్నానంతే. ఆ దేవుడే నడిపిస్తున్నాడు. అందువల్లే ఎవరేమి చెప్పినా నా దారిలో నేను వెళుతుంటాను" అని వ్యాఖ్యానించారు. 'కబాలీ' సినిమా తరువాత మరో చిత్రం కోసం చాలామంది దర్శకులను అడిగానని, చివరకు రంజిత్ గుర్తుకు వచ్చి, ముంబైలోని దారావీ గురించి ఓ కథను సిద్ధం చేయాలని కోరితే, మూడు నెలల్లోనే కథను తయారు చేసి తీసుకు వచ్చారని అన్నారు.
ఇది ఎన్నో రాజకీయ అంశాలతో కూడివున్న చిత్రమని, 'బాషా', 'నరసింహ'లోని ఆంటోనీ, నీలాంబరి పాత్రల్లా ఇందులో 'హరిదారా' పాత్ర ఎంతో సవాల్ తో కూడుకున్నదని, దాన్ని నానా పటేకర్ సమర్థవంతంగా పోషించారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్మాత, నటుడు ధనుష్, మీనా, ఏఎం రత్నం, కేఎస్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.