Telangana: ఉత్తమ్! గడ్డం తీయకుంటే సన్యాసుల్లో కలుస్తారు!: మంత్రి కేటీఆర్
- ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు చెప్పడంలో దిట్ట
- ‘కాంగ్రెస్’ని మించిన గలీజ్ పార్టీ ఇంకోటి లేదు
- దేశంలో అందరికీ గుండు కొట్టించిన పార్టీ కాంగ్రెస్
- మా సర్కార్ రైతు బంధు ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుంది
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకే తన గడ్డం తీసే ప్రసక్తే లేదని చెప్పిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం తీయకుంటే సన్యాసుల్లో కలుస్తారని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు చెప్పడంలో దిట్ట అని విమర్శించిన ఆయన, కాంగ్రెస్ పార్టీని మించిన గలీజ్ పార్టీ ఈ దేశంలో ఇంకోటి లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, రైతులపై కపట ప్రేమ చూపెడుతోందని అన్నారు.
కుంభకోణాలు, లంబకోణాలు లేని కాంగ్రెస్ నాయకుడు లేడని, అధికారంలో ఉన్నప్పుడు కమీషన్లు, కాంట్రాక్టులకే పరిమితమైన ఆ పార్టీ, దేశంలో అందరికీ గుండు కొట్టించిందని విరుచుకుపడ్డారు. కాగా, డెబ్బై ఏళ్లలో ఎవరూ చేయని విధంగా రైతు బంధు పథకంను తమ ప్రభుత్వం తెలంగాణలో ప్రవేశపెట్టనుందని, ఈ పథకాన్ని దేశంలో తప్పనిసరిగా అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రైతు బంధు ప్రభుత్వంగా తమ సర్కార్ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.