Supreme Court: అంతా నీ ఇష్టమే... కర్ణాటక మంత్రి కుమార్తెకు అభయమిచ్చిన సుప్రీంకోర్టు!

  • కుమార్తెకు బలవంతంగా ఇష్టం లేని పెళ్లి చేసిన కన్నడ మంత్రి
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన బాధితురాలు
  • ఇష్ట ప్రకారం నడుచుకోవచ్చన్న సుప్రీంకోర్టు

కర్ణాటకకు చెందిన ఓ మంత్రి కుమార్తె, తనకు ఇష్టం లేని పెళ్లిని బలవంతంగా జరిపించారని, తాను తల్లిదండ్రుల నుంచి విడిపోయేందుకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించి అభయం పొందారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, కోర్టు దస్త్రాల ప్రకారం 'ఎక్స్' (ఈ కేసులో అటు తల్లిదండ్రుల పేర్లు, ఇటు అమ్మాయి పేరును వెల్లడించేందుకు కోర్టు అంగీకరించలేదు) అనే 26 సంవత్సరాల యువతి ఓ కన్నడ మంత్రి కుమార్తె.

గుల్బర్గాలో వీరు నివాసం ఉంటున్నారు. తనను 20 రోజుల పాటు చిత్ర హింసలు పెట్టి, ఆపై బలవంతంగా పెళ్లిని చేశారని ఆరోపిస్తూ, బాధితురాలు ఢిల్లీ మహిళా కమిషన్ ను ఆశ్రయించారు. సుప్రీం ఆదేశాలతో ఆమెకు రక్షణ కల్పించారు పోలీసులు. ఇక కేసును విచారించిన చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్, జస్టిస్ డీవీ చంద్రచూడ్ ల ధర్మాసనం, బాధితురాలు అన్నీ తెలిసిన యువతి కాబట్టి, తాను అనుకున్న ప్రకారం నడచుకోవచ్చని తీర్పిచ్చింది.

అంతకుముందు ఆమె తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది జైసింగ్, తన క్లయింట్ పై అత్యాచారం చేయిస్తామని స్వయంగా ఆమె సోదరుడు, తల్లి బెదిరించారని ఆరోపించారు. ఆమె తల్లిదండ్రులు పరపతి గలవారని, తన క్లయింట్ కు హాని తలపెట్టవచ్చని అన్నారు. ఆమెకు ఇప్పుడు ఏ కుటుంబ సభ్యులతోనూ, బలవంతపు భర్తతోనూ ఉండాలని లేదని చెప్పారు.

 మళ్లీ బెంగళూరుకు వెళ్లి ఆగిపోయిన తన చదువును కొనసాగించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇదే సమయంలో తల్లిదండ్రుల తరఫున వాదించిన బసవ పాటిల్, ఆమెకు సంబంధించిన అన్ని విద్యార్హతల సర్టిఫికెట్లు, వస్తువులను తిరిగి ఇచ్చేందుకు తన క్లయింట్లు అంగీకరించారని వెల్లడించారు. ఆమెకు ఏ విధమైన హానీ తన క్లయింట్ల నుంచి రాబోదని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ఆమె పెళ్లి చెల్లుతుందని ఆదేశించాలని కోరగా, అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు.

  • Loading...

More Telugu News