Defence Minister: అత్యాచారాలకు, అమ్మాయిల దుస్తులకు సంబంధమే లేదు!: నిర్మలా సీతారామన్

  • ప్రభుత్వ సంస్థలు చేయగలిగింది స్వల్పమే
  • బయటికన్నా అమ్మాయికి ఇంట్లోనే బాధ
  • అత్యాచార నిందితుల్లో అత్యధికులు బంధుమిత్రులే
  • రక్షణమంత్రి నిర్మలా సీతారామన్

దేశంలో అత్యాచారాలను ఏ ప్రభుత్వ సంస్థలూ నిలువరించలేవని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. మహిళల పట్ల జరుగుతున్న దారుణాలను ఆపేందుకు ప్రభుత్వ పరంగా తీసుకునే చర్యలు చాలా స్వల్పమేనని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలకు పాల్పడుతున్న కేసులో అత్యధిక నిందితులు అమ్మాయిల బంధువులు, స్నేహితులేనని గుర్తు చేశారు.

న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, అత్యాచారాలపై స్పందించారు. మహిళలు వేసుకున్న దుస్తులు, వయసుతో నిమిత్తం లేకుండా దారుణాలు జరుగుతున్నాయని అన్నారు. రేప్ కు దుస్తులు, వ్యవహార శైలి కారణం కాదని అభిప్రాయపడ్డారు. మహిళలపై వీధుల్లో జరుగుతున్న నేరాలకన్నా, ఇళ్లలో జరుగుతున్న నేరాలే ఎక్కువగా నమోదవుతున్నాయని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.

కుటుంబ సభ్యులు, స్నేహితులు చేసిన నేరాలను మహిళలు సక్రమంగా ఎదుర్కోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. కొంతమంది అమ్మాయిల దుస్తుల గురించి మాట్లాడుతుంటారని, అటువంటి వారిని చిన్న పిల్లలపై జరుగుతున్న అత్యాచారాల మాటేంటని తాను ప్రశ్నిస్తున్నానని అన్నారు. ఎఫ్ఐఆర్ నమోదైన ప్రతి కేసులోనూ కఠిన చర్యలుంటాయని, దోషులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం వదలబోదని అన్నారు.

Defence Minister
Nirmala Sitaraman
Rapes
Girl Child
Women
  • Loading...

More Telugu News