Karnataka: కర్ణాటక ఎన్నికల బరిలో పోటీపడుతున్న అభ్యర్థుల్లో కోటీశ్వరులు!
- ఎన్నికల కమిషన్ వద్ద ఉన్న అభ్యర్థుల వివరాలు
- ఆ వివరాలను బయటపెట్టిన రెండు స్వచ్ఛంద సంస్థలు
- బీజేపీ అభ్యర్థుల్లో 93 శాతం మంది కోటీశ్వరులే
ఈ నెల 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయపార్టీలు తమ గెలుపు కోసం జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. 225 స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల బరిలో 2,654 మంది అభ్యర్థులు తలపడనున్నారు. అయితే, ఈ అభ్యర్థుల్లో కోటీశ్వరులే కాదు నేరగాళ్లూ ఉన్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్ వద్ద ఉన్న అభ్యర్థుల వివరాలను పరిశీలించిన అనంతరం రెండు స్వచ్ఛంద సంస్థలు ఈ సమాచారాన్ని బయటపెట్టడం గమనార్హం.
ఈ సందర్భంగా బీజేపీకి చెందిన 223 అభ్యర్థుల వివరాలను విశ్లేషించింది. ఈ సభ్యుల్లో 93 శాతం మందికి కోటి రూపాయలు విలువ చేసే ఆస్తులున్నాయని పేర్కొంది. మిగిలిన పార్టీల అభ్యర్థులతో పోల్చితే బీజేపీ అభ్యర్థులకే ఈ స్థాయిలో ఆస్తులు ఉన్నాయని పేర్కొంది. ఇక, కాంగ్రెస్ విషయానికొస్తే.. 94 శాతం మంది, జనతాదళ్ పార్టీలోని 199 మందిలో 154 మంది, 1090 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 199 మందికి కోటిరూపాయల ఆస్తులు ఉన్నట్టు ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్ లో ఆయా అభ్యర్థులు పేర్కొన్నారు.
క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న అభ్యర్థుల విషయానికొస్తే.. బీజేపీకి చెందిన 58 మంది అభ్యర్థులు తీవ్రమైన నేరాలు ఎదుర్కొంటున్నారని, వీరిలో హత్యా నేరం వంటి కేసులు కూడా నమోదైనట్టు తెలిపింది. కాంగ్రెస్ అభ్యర్థుల్లో 41 మందిపై పలు కేసులు, 29 మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉండగా, స్వతంత్ర అభ్యర్థుల్లో 70 మందిపై తీవ్రమైన కేసులు ఉన్నాయని ఆ స్వచ్ఛంద సంస్థలు పేర్కొన్నాయి.
ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్న కోటీశ్వర్ల సంఖ్య - 883
వారి సరాసరి ఆస్తుల విలువ - రూ.7.54 కోట్లు
తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థుల సంఖ్య - 254
క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల సంఖ్య -391