huzurabad: ఈ నెల 10న రైతుబంధు పథకం ప్రారంభిస్తున్నాం: మంత్రి ఈటల
- కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ప్రారంభిస్తాం
- రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తాం
- ఈ కార్యక్రమానికి లక్ష మంది రైతులు హాజరవుతారు
దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పథకాన్ని ఈ నెల 10న కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ప్రారంభించనున్నట్టు ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, హుజురాబాద్ లోని ఇందిరానగర్ లో ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని, దాదాపు లక్ష మందికి పైగా రైతులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు.
ఈ నెల 10న ఉదయం పదకొండు గంటలకు రైతుబంధు పథకం చెక్కుల పంపిణీతో పాటు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తొలి పర్యటన కరీంనగర్ జిల్లాతో ప్రారంభించారని, కొత్త సంక్షేమ పథకాలు కరీంనగర్ లో జిల్లాలోనే ప్రారంభించిన విషయాన్ని ఈటల ప్రస్తావించారు. కరీంనగర్ జిల్లా నుంచి ఏ కొత్త పథకం ప్రారంభించినా విజయవంతం అవుతుందని, అందుకే, రైతు బంధు పథకాన్ని కూడా ఈ జిల్లా నుంచే ప్రారంభించనున్నారని అన్నారు.