NEAT: మూడు సెకన్లు లేటైందని 'నీట్' పరీక్షకు అనుమతి నిరాకరణ.. బోరున విలపించిన అమ్మాయి!
- దేశవ్యాప్తంగా నేడు నీట్ ఎంట్రెన్స్ టెస్ట్
- 10 గంటలకు పరీక్ష ప్రారంభం
- 9.30కే గేట్ల మూసివేత
నేడు దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్ష జరుగుతుండగా, హైదరాబాద్ కూకట్ పల్లిలో ఏర్పాటు చేసిన డీఏవీ సెంటర్ లో నిమిషం ఆలస్యం నిబంధన పలువురి ఆశలపై నీరు చల్లింది. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సివుండగా, అధికారులు 9.30కే పరీక్ష హాల్ గేట్లను మూసేసారు. గేట్లు మూసి వేస్తున్నారన్న విషయాన్ని దూరం నుంచే చూసిన ఓ అమ్మాయి, పరిగెత్తుకుంటూ వచ్చినప్పటికీ, గేటును సమీపించే సరికి సమయం 9.30 గంటలు దాటి మూడు సెకన్లు ఆలస్యం అయింది.
దీంతో ఆమెను అధికారులు లోనికి అనుమతించ లేదు. ఆపై సదరు విద్యార్థిని బోరున విలపించింది. తనను అనుమతించాలని ప్రాధేయపడినా అధికారులు కనికరించలేదు. ఆపై కూడా పరీక్షా కేంద్రానికి చేరుకున్న మరో ముగ్గురు అమ్మాయిలు కూడా ఆలస్యం అయ్యామని కన్నీరు కార్చారు. కాగా, నీట్ కోసం తెలంగాణలో 81, ఏపీలో 86 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 13,26,275 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, అమ్మాయిలు 56.25 శాతం మంది ఉన్నారు.