Hyderabad: హైదరాబాద్‌లో వర్షాకాల సన్నద్ధతపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సూచనలు, ఆదేశాలు

  • మ్యాన్ హోళ్ల నిర్వహణపై శ్రద్ధ వహించాలి
  • రోడ్లపై బీటీ లేయింగ్ పనులు చేయాలి
  • పలుచోట్ల హోర్డింగులను వెంటనే తొలగించాలి
  • డీ వాటరింగ్ పంపులు ఏర్పాట్లు చేయాలి

వర్షకాలం రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఎదురయ్యే అన్ని పరిస్థితులకు సర్వం సన్నద్ధంగా ఉండాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌... జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన సుదీర్ఘ సమీక్షా సమావేశంలో... నిన్నటి భారీ వర్షాల వల్ల ఎదురైన పరిస్థితులు, వాటిని ఎదుర్కొన్న తీరును అధికారులు మంత్రికి వివరాలు అందించారు. ముఖ్యంగా నాలాల్లో ఉన్న అడ్డంకులు, పూడికతీతను తొలగించాలని కేటీఆర్‌ ఆదేశించారు.

ఇప్పటికే నాలా అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం నిధులను సైతం కేటాయించిందన్నారు. నాలాల ఆక్రమణల్లో ఉన్న వారి సామాజిక పరిస్థితులను అర్థం చేసుకుని వారికి తగిన ఆర్థిక పరిహారంతో పాటు అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయిస్తామని తెలిపారు. నాలాల మరమ్మతుల కోసం గుర్తించిన పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.

వర్షకాలంలో కీలకమైన వాటర్ లాంగింగ్ (నీళ్లు నిల్వడం) పాయింట్లు, రోడ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ట్రాఫిక్, పోలీసు, జీహెచ్‌ఎంసీ గుర్తించిన నీళ్లు నిలిచే ప్రాంతాల్లో సాధ్యమైనంత వరకు శాశ్వత ప్రాతిపాదికన పనులు నిర్వహించాలని, అలాంటి పరిష్కారం సాధ్యం కాకుంటే వర్షకాలం మేరకు తక్షణ పరిష్కార మార్గాలు (డీ వాటరింగ్ పంపులు) ఏర్పాట్లు చేయాలన్నారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ వద్ద సూమారు 100 పంపులు అందుబాటులో ఉన్నాయని, అవసరం అయితే ఈ సంఖ్యను మరింత పెంచుతామని అధికారులు మంత్రికి తెలిపారు.

వాటర్ వర్క్స్ పరిధిలోని వాటర్ సీవేజీ, స్ట్రామ్ వాటర్ డ్రయినేజీలు, మ్యాన్ హోళ్ల నిర్వహణపై శ్రద్ధ వహించాలని కేటీఆర్‌ అన్నారు. రోడ్ల నిర్వహణలో భాగంగా రోడ్డు కట్టింగ్‌ పునరుద్ధరణ పనులు, పాట్ హోళ్ల నిర్వహణతోపాటు రోడ్లపై బీటీ లేయింగ్, వాటి పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు.

వర్షకాల సన్నద్ధత పనుల కోసం ఇప్పటి నుంచే జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ విభాగంతో ఇతర విభాగాలు కలసి సమన్వయంతో ఒక ప్రణాళిక తయారు చేయాలన్నారు. నగరంలో పలు చోట్ల ప్రమాదం సంభవించేందుకు ఏ మాత్రం అవకాశం ఉన్నా అలాంటి చోట్ల హోర్డింగులను వెంటనే తొలగించాలన్నారు. సోషల్ మీడియాతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా తమ దృష్టికి వచ్చే సమస్యల పరిష్కారంలో మరింత చొరవ చూపించాలని, సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తాము చేస్తోన్న పనులను పౌరులతో పంచుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.

  • Loading...

More Telugu News