Prakash Raj: నా ముత్తాత గురించే తెలియదు.. ఇక నెహ్రూ, టిప్పు సుల్తాన్ ల గురించి అడిగితే ఏం చెబుతా?: ప్రకాష్ రాజ్

  • మోదీని ప్రశ్నించినప్పటి నుంచి బాలీవుడ్ లో అవకాశాలు రాలేదు
  • తాను ప్రశ్నించేకొద్దీ దాడులు ఎక్కువ చేశారు
  • నెహ్రూ ఏం చేశారు, టిప్పు సుల్తాన్ ఏం చేశారు అని ప్రశ్నిస్తారు
  • నా ముత్తాత గురించే నాకు తెలియదు.. టిప్పు సుల్తాన్ గురించి ఏం చెప్పగలను?

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తాను గళమెత్తినప్పటి నుంచి తనకు ఆఫర్లు ఇవ్వడాన్ని బాలీవుడ్ ఆపేసిందని సినీ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు.  గత అక్టోబరులో జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య నేపథ్యంలో మోదీ మౌనాన్ని తాను విమర్శించినప్పటి నుంచి హిందీ సినీపరిశ్రమ తనను పక్కన పెట్టేసిందని చెప్పారు. దక్షిణాది సినీపరిశ్రమలో ఇలాంటి సమస్య లేదని అన్నారు. తన వద్ద కావాల్సినంత డబ్బు ఉందని... బాలీవుడ్ లో సినిమాలు రానంత మాత్రాన తాను టెన్షన్ పడనని చెప్పారు.

గౌరీ లంకేష్ హత్య తనను ఎంతగానో కలచివేసిందని ప్రకాష్ రాజ్ అన్నారు. ఎప్పుడూ ప్రశ్నించే గొంతుక (గౌరీ), ఒక్కసారిగా మూగబోవడాన్ని జీర్ణించుకోలేక పోయానని చెప్పారు. తాను ప్రశ్నించేకొద్దీ తనను సైలెంట్ గా ఉంచేందుకు ప్రయత్నాలు ఎక్కువయ్యాయని... తనకు పని దక్కకుండా చేయడం ద్వారానూ, లేదా తన క్యారెక్టర్ ను చంపేయడం ద్వారానూ బీజేపీ తనను దెబ్బతీసేందుకు యత్నించిందని తెలిపారు.

అమిత్ షాకు భయపడాల్సిన అవసరం మనకు ఉందా? అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ఒక నాయకుడిగా అమిత్ షాకు ఉన్న క్రెడెన్షియల్స్ ఏమిటని అడిగారు. దేశం అత్యున్నత మార్గంలో పయనించేందుకు అమిత్ షా ఒక్క ఐడియా అయినా ఇచ్చారా? అని ఎద్దేవా చేశారు. అతను ఒక చాణక్యుడని, ప్రభుత్వాలను కూల్చగలడని, ఎన్నికల్లో విజయం సాధించగలడని... అయితే, ఇవన్నీ తనకు అవసరమా? అని ప్రశ్నించారు.

2 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తానంటూ యువతకు మోదీ హామీ ఇచ్చారని, నల్లధనం అంతు చూస్తానని చెప్పారని... కానీ, ఇంతవరకు ఆయన ఏమీ చేయలేకపోయారని ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. బీజేపీవాళ్లు ఎప్పుడు చూసినా గతం గురించే మాట్లాడతారని... నెహ్రూ ఏం చేశారు? టిప్పు సుల్తాన్ ఏం చేశారు? మన సనాతన ధర్మం ఏం చెప్పింది? తదితర ప్రశ్నలు వేస్తుంటారని ఎద్దేవా చేశారు. తన ముత్తాత గురించే తనకు తెలియదని... ఇక టిప్పు సుల్తాన్ గురించి అడిగితే తాను ఏం చెబుతానని అన్నారు.

ఎవరైనా ప్రశ్నిస్తే హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేస్తారని, పాకిస్థాన్ కు వెళ్లాలని సూచిస్తారని ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. ఒక మంచి బీచ్ రిసార్ట్ కు పంపిస్తే ఎంజాయ్ చేస్తాం కదా? అని నవ్వుతూ అన్నారు. వాళ్ల మైండ్ లో పాకిస్థాన్ నిండిపోయింది కనుకే... ఎప్పుడూ పాక్ గురించే మాట్లాడతారని ఎద్దేవా చేశారు. పాకిస్థాన్ నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉందని... ఇస్లాంను వాళ్లు ఏకైక అధికారిక మతంగా చేసుకున్నారని, ఆ దేశాన్ని పేదరికం పట్టి పీడిస్తోందని... ఇండియా కూడా అలాగే ఉండాలని మీరు భావిస్తున్నారా? అంటూ బీజేపీని ప్రశ్నించారు.

ఏదైనా రాజకీయ పార్టీలో చేరడం కానీ, లేదా సొంతంగా పార్టీని స్థాపించడం కానీ చేయాలనే ఆలోచన తనకు వచ్చిందని... కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలకతీతంగా గొంతుకను వినిపించే వ్యక్తి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఒక్కసారి రాజకీయాల్లోకి అడుగుపెడితే, దాని ట్రాప్ లో పడినట్టేనని చెప్పారు. తనకు ఎంపీ, ఎమ్మెల్యే కావాలనే కోరిక లేదని చెప్పారు. రాజకీయ చైతన్యంలోనే అసలైన రాజకీయం ఉందని అన్నారు. తన రాజకీయ చైతన్యం కేవలం రెండు, మూడు నెలలకే పరిమితం కాబోదని, తనకు ఎంతో సహనం ఉందని చెప్పారు. రాత్రికి రాత్రే పరిస్థితులను మార్చడం సాధ్యం కాదని అన్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రకాష్ రాజ్ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ది ప్రింట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు.

  • Loading...

More Telugu News