Narendra Modi: ఈ ఎన్నికలు మీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి: కన్నడిగులతో ప్రధాని మోదీ

  • ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎన్నుకోవడానికే కాదు
  • మహిళల భద్రత, రైతుల సంక్షేమం కోసం
  • ఎన్నికల్లో సరైన వారిని ఎన్నుకోవాలి
  • కాంగ్రెస్‌ పార్టీ ఆర్మీని కూడా గౌరవించదు

వచ్చే నెలలో జరగనున్న ఎన్నికలు కర్ణాటక ప్రజల భవిష్యత్తుని నిర్ణయిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు కర్ణాటకలోని కలబురగిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ... కేవలం ఎమ్మెల్యేలను ఎన్నుకోవడానికి మాత్రమే ఈ ఎన్నికలు కాదని, దానికన్నా ఎక్కువగా మహిళల భద్రత, రైతుల సంక్షేమం వంటి అంశాల కోసం సరైన వారిని ఎన్నుకోవాలని అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ కనీసం మన ఆర్మీకి కూడా గౌరవం ఇవ్వదని, సర్జికల్స్‌ స్ట్రయిక్స్ జరిగిన తరువాత వాటికి ఆధారాలు చూపాలని కాంగ్రెస్‌ డిమాండ్ చేసిందని మోదీ అన్నారు. గతంలోనూ కాంగ్రెస్‌ దేశంలో ఇటువంటి ఘటనలకు పాల్పడిందని అన్నారు. 'కర్ణాటక అంటే శౌర్యానికి ప్రతీక, కానీ, పాకిస్థాన్‌తో యుద్ధం గెలిచిన తరువాత 1948లో ఫీల్డ్‌ మార్షల్‌ కరియప్ప, జనరల్‌ తిమ్మయ్యల పట్ల నాటి కాంగ్రెస్‌ సర్కారు ఎలా ప్రవర్తించిందో మనకు తెలుసు. జనరల్‌ తిమ్మయ్యను అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ, రక్షణ శాఖ మంత్రి కృష్ణన్‌ మీనన్‌ అవమానపరిచారు. అటువంటి చరిత్ర కాంగ్రెస్‌కి ఉంది' అని మోదీ అన్నారు.

కాంగ్రెస్‌ నేతలు తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్నారని, కాంగ్రెస్‌ పాలనలో బ్రాండ్‌ కర్ణాటక దెబ్బతిందని మోదీ అన్నారు. అవినీతిలో కూరుకున్న కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. గత ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రి చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చి గెలిచిందని, కానీ, చేయలేదని, కాంగ్రెస్‌ పార్టీ దళిత కమ్యూనిటీని మోసం చేసిందని పేర్కొన్నారు. ఇలా కాంగ్రెస్‌ ఓట్ల కోసం మోసపూరిత రాజకీయాలు చేస్తోందని మోదీ విమర్శించారు.

గతంలో తాము కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, కానీ, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ మాత్రం నీటి వనరులు అధికంగా ఉన్నప్పటికీ నీళ్లు అందించలేకపోతోందని మోదీ అన్నారు. బీజేపీకి ఓటేసి కర్ణాటకను అభివృద్ధి చేసే అవకాశం తమకు ఇవ్వాలని కోరారు.    

  • Loading...

More Telugu News