Badminton: బ్యాడ్మింటన్ కు పాకిన మ్యాచ్ ఫిక్సింగ్... ఇద్దరిపై నిషేధం
- వరుస ఫిక్సింగ్ లు చేసిన మలేషియా ఆటగాళ్లు
- ఒకరిపై 20 ఏళ్లు, మరొకరిపై 15 ఏళ్ల నిషేదం
- భారీ జరిమానా కూడా
ఇద్దరు మలేషియా బ్యాడ్మింటన్ ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్టు తేలడంతో వారిక బ్యాడ్మింటన్ రాకెట్ పట్టుకోకుండానే కెరీర్ ముగిసేలా శిక్షలను విధించారు. తన్ చన్ సియాంగ్ (31), జూనియర్ ప్రపంచ చాంపియన్ జుల్ఫాద్లి జుల్కిఫ్లి (25)లు పలుమార్లు ఫిక్సింగ్ చేశారని ఇండిపెండెంట్ ఎంక్వయిరీ కమిటీ తేల్చడంతో వీరిపై వరుసగా 15, 20 ఏళ్ల పాటు నిషేధాన్ని విధిస్తూ, నిర్ణయం వెలువడింది.
ఈ నిషేధ సమయంలో వారు బ్యాడ్మింటన్ కు సంబంధించిన ఎటువంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనరాదని బీడబ్ల్యూఎఫ్ (అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య) పేర్కొంది. కాగా, ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలో మ్యాచ్ ఫిక్సింగ్ పై శిక్షలు పడటం ఇదే తొలిసారి. ఇక సియాంగ్ కి 15 వేల డాలర్లు, జుల్ఫాద్లికి 25 వేల డాలర్లు జరిమానా విధిస్తున్నట్టు కూడా అధికారులు వెల్లడించారు.