Karnataka elections: గుర్రాలు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు, వీడియో ప్లేయర్లను ఆస్తులుగా చూపించిన కర్ణాటక అభ్యర్థులు

  • రేసు గుర్రం నుంచి ఆదాయం పొందుతున్న మంత్రి జార్జ్
  • కాఫీ మెషిన్ కూడా ఉందన్న అభ్యర్థి క్రిష్ణప్ప
  • కిచెన్ వస్తువుల వివరాలు సైతం వెల్లడి

గుర్రాలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, జనరేటర్లు, వీడియో ప్లేయర్లు, కాఫీ మెషిన్లు ఇవన్నీ ఆస్తులే...! ఆశ్చర్యపోతున్నారా...?  కర్ణాటక అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో వీటిని ఆస్తులుగానే పేర్కొన్నారు మరి. అయితే వీటన్నింటినీ చూపించిన వారు వాచీల్లాంటివి మాత్రం పేర్కొనకపోవడం విశేషం. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు అభ్యర్థుల అఫిడవిట్లలో చాలానే ఉన్నాయి.

మంత్రి కేజే జార్జ్ తాను రేసు గుర్రం నుంచి ఆదాయం పొందుతున్నట్టు పేర్కొన్నారు. గోవింద్ నగర్ నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రియా కృష్ణ పజేరో, ఆడి, బొలెరో తదితర వాహనాలతోపాటు వాటర్ ట్యాంకర్లు, ఎక్స్ కవేటర్లు తనకు ఉన్నాయని తెలియజేశారు. రూ.80,000 విలువ చేసే వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయడం విశేషం.

ప్రియా తండ్రి, విజయ్ నగర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం క్రిష్ణప్ప రూ.4.66 లక్షల విలువ చేసే కిచెన్ సామగ్రి ఉందని, రూ.1.1 లక్ష విలువచేసే వీడియో క్యాసెట్ ప్లేయర్, ప్రింటర్, రూ.2.15 లక్షల విలువ చేసే టీవీ, రూ.30వేల విలువ చేసే ఫ్రిజ్ ఉన్నాయని తెలిపారు. మాజీ మంత్రి జి.పరమేశ్వర తాను ఎల్ఐసీ ఏజెంట్ గానూ పనిచేస్తున్నానని, తనకో కాఫీ తయారీ మెషిన్ ఉందని, టీవీ, ఫ్రిజ్ కూడా వున్నాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News