facebook: ఫేస్ బుక్ లో కొత్త ఫీచర్... బ్రౌజింగ్ హిస్టరీ చెరిపేసుకునే అవకాశం
- ఈ ఫీచర్ పై ఫేస్ బుక్ వార్షిక సమావేశంలో చర్చ
- అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అమల్లోకి
- వెల్లడించిన ఫేస్ బుక్ చీఫ్ జుకెర్ బర్గ్
ఇటీవల యూజర్ల డేటా చౌర్యం ఘటనతో తల్లడిల్లిన ఫేస్ బుక్, యూజర్లకు కొత్త ఫీచర్లను అందించడంపై దృష్టి పెట్టింది. బ్రౌజింగ్ హిస్టరీ డిలీట్ చేసుకునేందుకు అనుమతించే ‘క్లియర్ హిస్టరీ’ ఆప్షన్ ను తీసుకొస్తున్నట్టు సంస్థ చీఫ్ మార్క్ జుకెర్ బర్గ్ వెల్లడించారు. తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ విషయమై ఆయన పోస్ట్ పెట్టారు.
ఈ ఫీచర్ పై నేటి నుంచి మొదలయ్యే ఫేస్ బుక్ వార్షిక సమావేశంలో చర్చించనున్నట్టు ఆయన చెప్పారు. చూసిన వెబ్ సైట్లు, యాప్స్ సమాచారాన్ని అకౌంట్ నుంచి డిలీట్ చేసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందన్నారు. బ్రౌజర్ లో కుకీస్ క్లియర్ కూడా చేసుకోవచ్చని చెప్పారు. ఈ విషయంలో నిపుణులు, విధాన కర్తలు, నియంత్రణ సంస్థల అభిప్రాయాలు తెలుసుకుని వచ్చే కొన్ని నెలల్లో అమల్లోకి తెస్తామని ప్రకటించారు.