Sujana Chowdary: బీజేపీలోకి జంప్ చేయనున్న సుజనా చౌదరి?... టీడీపీ వర్గాల్లో తీవ్ర కలకలం!

  • బీజేపీలోకి ఫిరాయించనున్న కేంద్ర మాజీ మంత్రి
  • 'దక్కన్ క్రానికల్' ప్రత్యేక కథనం
  • నిజాన్ని బయటకు రానీయండి చూద్దాం
  • సుజనాపై స్పందించిన లోకేష్

కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం నేత వై.సుజనా చౌదరి బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. టీడీపీ వర్గాల్లో సంచలనం కలిగించి, చర్చోపచర్చలకు దారితీసిన ఈ వార్తను దక్షిణాదిన అత్యధిక సర్క్యులేషన్ ఉన్న 'డక్కన్ క్రానికల్' ప్రచురించింది. 2014 ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వలసలను, నిధుల సేకరణ కార్యక్రమాలను సుజనా చౌదరి పర్యవేక్షించిన సంగతి తెలిసిందే. ఎంపీగా ఉన్న ఆయన్ను తన మంత్రివర్గంలోకి నరేంద్ర మోదీ ఆహ్వానించారు కూడా. నాలుగేళ్ల తరువాత, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. ఇప్పటికే బీజేపీ జాతీయ నేతలతో సుజనా చౌదరి చర్చించారని, ఆయన త్వరలోనే పార్టీ మారనున్నారని నేడు పబ్లిష్ అయిన వార్త కలకలం రేపుతోంది.

ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ 'ఎన్సీబీఎన్' పేరిట ఓ వాట్స్ యాప్ గ్రూప్ ను క్రియేట్ చేయగా, ఎంఎల్ఏలు, ఎంపీలు, మంత్రులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ గ్రూప్ లో సుజనా పార్టీ నుంచి జంప్ కానున్నారన్న వార్త సారాంశాన్ని ఒకరు పోస్టు చేసి చర్చను ప్రారంభించగా, మంత్రి నారా లోకేష్ స్పందించినట్టు తెలుస్తోంది. "ఈ విషయంలో ఇంతవరకూ సమాచారం లేదు. నిజాన్ని బయటకు రానీయండి చూద్దాం" అని ఆయన వాట్స్ యాప్ గ్రూప్ లో ఓ పోస్టు పెట్టినట్టు తెలుస్తోంది.

ఇక సుజనా చౌదరి పార్టీని వీడితే, ఆయన దారిలోనే మరికొందరు ఎంఎల్ఏలు, మంత్రులు నడిచే అవకాశాలు ఉన్నాయని తెలుగుదేశం సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడటం గమనార్హం. గతంలో ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి మధ్య అనుసంధానంగా వ్యవహరించిన సుజనా, ఆ సమయంలోనే బీజేపీ అగ్రనేతలకు దగ్గరయ్యారని, ఆ పరిచయాలతోనే ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక సమాచారం అందాల్సి వుంది.

  • Loading...

More Telugu News