Hyderabad: మేడపై అమ్మాయి, అబ్బాయి... చూసిన తండ్రి... యువకుడి మృతి కేసులో సీసీటీవీ కీలక క్లూ!

  • బాలికతో యువకుడి ప్రేమాయణం
  • అమ్మాయి తండ్రి చూసేసరికి భవనం పైనుంచి దూకిన యువకుడు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • కేసును ఛేదించేందుకు సహకరించిన టెక్నాలజీ

మర్డర్ కేసుగానీ, హత్యాచారం కానీ, దొంగతనం కానీ... అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం నేరాల గుట్టు విప్పడంలో పోలీసులకు ఎంతగా సహాయపడుతుందో చెప్పకనే చెబుతున్న ఘటన ఇది. హైదరాబాద్, సంతోష్ నగర్ పరిధిలోని రియాసత్ నగర్ లో గత నెల 29వ తేదీన అనుమానాస్పద స్థితిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎలక్ట్రీషియన్ రహీముద్దీన్ (33) మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఓ రెండంతస్తుల భవంతి పక్కనే గాయాలతో రహీముద్దీన్ పడిఉండగా, ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

ఆపై కేసును విచారించిన పోలీసులు ఆ భవంతిపై పరిశీలించినా ఫలితం దక్కలేదు. చివరకు సీసీటీవీ ఫుటేజ్ లు, అతని కాల్ డేటాను పరిశీలించిన తరువాత ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. 29వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత రహీముద్దీన్, ఓ బాలికతో ఆ భవంతి పైకి వెళ్లాడని పోలీసులు కనిపెట్టారు. ఆ బాలిక తమకు ఫిర్యాదు చేసిన వ్యక్తి కుమార్తేనని తెలుసుకున్నారు. దీంతో కేసు మిస్టరీ సగం వీడింది.

ఆ బాలిక, రహీముద్దీన్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఆమెను కలిసేందుకు ఎప్పటిలానే వారింటికి వచ్చిన రహీముద్దీన్, ఆమెతో కలసి భవంతిపైకి వెళ్లాడు. ఆ సమయంలో బాలిక తండ్రి నిద్రపట్టక భవనం పైకి ఎక్కి, అక్కడే ఉన్న తన కుమార్తెను, రహీముద్దీన్ నూ చూశాడు. అంతే, తనను ఏం చేస్తారోనన్న భయంతో రహీముద్దీన్, పైప్ లైన్ పట్టుకుని కిందకు జారే ప్రయత్నంలో రెండు అంతస్తుల భవంతిపై నుంచి కిందపడ్డాడు. ఇదంతా సీసీ టీవీలో రికార్డయింది.  

విషయం చెబితే, ఎక్కడ కుమార్తె గురించి నలుగురికీ తెలుస్తుందోనన్న ఆందోళనతో ఆమె తండ్రే గుర్తు తెలియని వ్యక్తి తన ఇంటి పక్కన పడివున్నాడని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రహీముద్దీన్ కాల్ డేటా పరిశీలించిన తమకు ఆ బాలికతో అతను ఎన్నోసార్లు మాట్లాడినట్టు, చాట్ చేసినట్టు తెలిసిందని, ఆ తర్వాత సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించగా నిర్ధారణ అయిందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News