Mahatma Gandhi: నరేంద్ర మోదీ సమావేశానికి కేసీఆర్, చంద్రబాబు డుమ్మా!
- నేడు గాంధీ జయంతి వేడుకల జాతీయ కమిటీ సమావేశం
- హాజరు కాబోవడం లేదన్న చంద్రబాబు, కేసీఆర్
- పినరయి విజయన్, సిద్ధరామయ్య కూడా గైర్హాజరే
మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను ఏడాది పాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని తలపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ, ఇందులో భాగంగా నేడు ఏర్పాటు చేసిన తొలి జాతీయ కమిటీ సమావేశానికి పిలుపునివ్వగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కాబోవడం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నందున చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. "రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోనందునే చంద్రబాబు ఈ సమావేశానికి వెళ్లడం లేదు" అని పార్టీ నేత ఒకరు తెలిపారు.
ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమి ఏర్పాట్లలో బిజీగా ఉన్న కేసీఆర్, ముందుగా నిర్దేశించుకున్న కార్యక్రమాలు ఉన్నందున ఈ సమావేశానికి హాజరు కాలేనని కేంద్రానికి సమాచారం ఇచ్చారు. "నేడు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. అందువల్లే ఆయన ఈ సమావేశానికి వెళ్లడం లేదు" అని టీఆర్ఎస్ నేత ఒకరు తెలిపారు.
ప్రధాని అధ్యక్షతన అన్ని రాష్ట్రాల సీఎంలు, మాజీ ప్రధానులు సహా 114 మంది సభ్యులుగా ఉన్న ఈ కమిటీ తొలి సమావేశానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం పినరయి విజయన్ కూడా హాజరు కాబోవడం లేదని సమాచారం. మన్మోహన్ సింగ్, దేవెగౌడ, అటల్ బిహారీ వాజ్ పేయి, ఎల్కే అద్వానీ తదితరులతో పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, లోక్ సభ స్పీకర్, కేంద్ర మంత్రులు, విపక్షనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర గాంధీ కుటుంబీకులు కూడా సభ్యులుగా ఉన్నారు. గాంధీ 150వ జయంతి వేడుకలు వచ్చే సంవత్సరం అక్టోబర్ 2 నుంచి 2020 అక్టోబర్ 2 వరకూ సాగుతాయి. ఈ ఉత్సవాల కోసం కేంద్రం రూ. 150 కోట్లను కేటాయించింది.