Narendra Modi: ఇలాంటి వాళ్లా మోదీకి వారసులు?: రేణుకాచౌదరి

  • వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విప్లవ్ కుమార్, విజయ్ రూపానీ
  • విరుచుకుపడుతున్న విపక్ష నేతలు
  • వీళ్లకు ఉన్న జ్ఞానం ఇంతేనేమో అన్న రేణుక

త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ప్రధాని మోదీకి తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో, బీజేపీపై విపక్ష నేతలు విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి మాట్లాడుతూ, ఇలాంటి వాళ్లా మోదీకి వారసులు? అంటూ ప్రశ్నించారు. వీళ్లా ప్రజలను పాలించేది? అంటూ మండిపడ్డారు.

సమాజానికి వీళ్లు ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఒకరేమో గూగుల్ ను నారదుడితో పోలుస్తూ మాట్లాడతారని, మరొకరేమో మహాభారత కాలంలోనే ఇంటర్నెట్ ఉందని అంటారని, యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్యోగాలేం చేస్తారు.. పాన్ షాపులు పెట్టుకుని బతకాలని సూచిస్తారని ఎద్దేవా చేశారు. వీళ్లకు ఉన్న జ్ఞానం ఇంతేనేమో అని అన్నారు. వీరి వివాదాస్పద వ్యాఖ్యలు ఇంతటితో ఆగబోవని చెప్పారు.

మరోవైపు, వెంటనే వచ్చి కలవాలంటూ విప్లవ్ కుమార్ కు బీజేపీ అధిష్ఠానం సమన్లు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోదీ తనను కొడుకులా భావిస్తారని, ఆయనకు తనపై ఆగ్రహం లేదని చెప్పారు. మోదీ అపాయింట్ మెంట్ ను తాను గతంలోనే తీసుకున్నానని... ఇప్పుడు సమయం కుదరడంతో, వెళ్లి ఆయనను కలవబోతున్నానని తెలిపారు.

Narendra Modi
biplab kumar deb
vijay rupani
renuka chowdary
  • Loading...

More Telugu News