Hyderabad: సగటు కన్నా చాలా అధికం... హైదరాబాద్ మండే కొలిమి!
- సాధారణం కన్నా 4 డిగ్రీల వరకూ అధికం
- హైదరాబాద్ లో 42.4 డిగ్రీల వేడిమి
- అత్యవసరమైతేనే బయటకు రండి
- హెచ్చరిస్తున్న అధికారులు, వైద్యులు
ఈ వేసవి మండే కొలిమిని తలపిస్తోంది. మే నెల రాకముందే సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీ, తెలంగాణల్లో ఎండల తీవ్రత మరింతగా పెరిగింది. ఆదిలాబాద్, నిజామాబాద్, గుంటూరు, చిత్తూరు, విశాఖపట్నం తదితర జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా బొగ్గు గనులున్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రత అధికంగా ఉంది.
నిన్న హైదరాబాద్ లో ఈ సీజన్ లోనే అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం పూట రహదారులన్నీ కర్ఫ్యూను తలపించాయి. నేడు కూడా ఉష్ణోగ్రత అధికంగానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే చాలా అధికంగా ఎండ వేడిమి ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇదిలావుండగా, ఎల్ నినో, క్యుములో నింబస్ మేఘాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి.