antrox: ఆంత్రాక్స్ నివారణకు మాతృభాషలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి: ఏపీ మంత్రి ఆనందబాబు

  • ఐటీడీఏ అధికారులకు ఆనందబాబు ఆదేశాలు
  • పాడేరు ఐటిడీఏ పరిధిలోముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలి
  • జంతు మాంసాన్ని గిరిజనులు తమ ఇళ్లలో ఎండపెట్టడాన్ని నివారించాలి

విశాఖ మన్యంలో ప్రబలిన ఆంత్రాక్స్ వ్యాధి బారిన ఎక్కువ మంది గిరిజనులు పడకుండా ఉండేందుకు వారి మాతృభాషలు కువి, కోదులలో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని ఐటీడీఏ అధికారులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ఆదేశించారు. సచివాలయం 3వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్ లో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కాగా, ఇప్పటి వరకు ఆంత్రాక్స్ సోకిన 17 మందిని విశాఖ కేజీహెచ్ కు తరలించినట్లు, ఈ వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గిరిజనులకు వివరిస్తున్నట్లు మంత్రికి అధికారులు తెలిపారు. ఈ వ్యాధి ప్రధానంగా జంతువుల నుంచి సోకుతుందని, అందువల్ల చనిపోయిన జంతు మాంసం తినవద్దని గిరిజన నివాస ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.

   గిరిజనులకు అవగాహన కల్పించాలి

ప్రస్తుతం ఈ వ్యాధి రెండు మండలాల్లో ప్రబలిందని ఆనందబాబు చెప్పారు. గతంలో చింతపల్లి, జీకేవీధి, ముంచింగ్ పుట్ట్, అరకు, పెదబయలు మండలాలలో కూడా ఈ వ్యాధి సోకిన దాఖలాలు ఉన్న కారణంగా, పాడేరు ఐటిడీఏ పరిధిలోని గ్రామాలన్నింటిలో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గిరిజనులు జంతు మాంసాన్నితమ ఇళ్లలో ఎండపెడుతూ ఉంటారని, దానిని నివారించాలని సూచించారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వ్యక్తి రెండు నెలల వరకు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుందని, కోర్సు మొత్తాన్ని వాడే విధంగా వారికి తెలియజెప్పాలని అధికారులకు చెప్పారు. గిరిజన, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, విద్య శాఖల సిబ్బంది, సాధికార మిత్రలు, ఆశా వర్కర్లు అందరూ కలసి వారికి అవగాహన కల్పించాలని, సాధికార మిత్రలను ఇంటింటికి పంపి గిరిజనులకు అర్థమయ్యే విధంగా వారి మాతృభాషలో చెప్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం, ప్రజాప్రతినిధులు కూడా కలిసి గిరిజనులకు ఈ విషయమై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
 
వ్యాధి సోకిన గిరిజనులకు బియ్యం, పదివేలు ఇవ్వాలి : గిడ్డి ఈశ్వరి వినతి

డబ్బు లేక వ్యాధి సోకిన గిరిజనులను ఆసుపత్రికి తరలిస్తామంటే రావడంలేదని, తాను దగ్గరుండి మరో ముగ్గురిని విశాఖ కేజీహెచ్ కి తరలించినట్లు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి   చెప్పారు. ప్రస్తుతం వ్యాధి సోకిన ప్రాంతంలో 80 కుటుంబాలు ఉంటున్నాయని, వారందరికీ 35 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని, వ్యాధి సోకిన వారికి రూ.10 వేల చొప్పున  ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్ల పక్కన పశువులను ఉంచుతారని, అలా కాకుండా ఊరిబయట పశువుల పాకలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటే పరిశీలించాలని,  మరుగుదొడ్లు నిర్మించినా గిరిజనులు వినియోగించుకోవడం లేదని, స్టోర్ రూమ్ లుగా వాడుకుంటున్నారని, ప్రభుత్వం పంపిణీ చేసిన దోమ తెరలను కూడా సద్వినియోగం చేసుకోవడం లేదని, వాటిని వినియోగించుకునేలా వారికి అవగాహన కల్పించాలని ఈశ్వరి కోరారు. ఈ మేరకు స్పందించిన మంత్రి ఆనందబాబు, వారికి బియ్యం అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  

మైకుల ద్వారా కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి

ఆంత్రాక్స్ తో పాటు వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల గురించి కరపత్రాలు ప్రచురించి పంపామని, వాటిని సంతలు జరిగే ప్రాంతాల్లో పశుసంవర్థక శాఖ, సెర్ఫ్, సాధికార మిత్రలు కలిసి పంచిపెట్టాలని గిరిజన శాఖ డైరెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. అలాగే మైకుల ద్వారా కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని, చనిపోయిన జంతువులను పూర్తిగా కాల్చివేయడం మంచిదని, పీహెచ్ సీల వారీగా మందులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వర్షాలు పడేటప్పుడు రక్తపరీక్షలు సేకరించడంతోపాటు వైద్యశిబిరాలు నిర్వహించాలని, వర్షాలు కురిసే లోపల గ్రామాలలో రోడ్లు, గ్రామీణ నీటి సరఫరా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.  

  • Loading...

More Telugu News