KCR: నేను చేసిన ఆలోచనతో దేశ వ్యాప్తంగా ప్రకంపనలు: సీఎం కేసీఆర్
- దేశంలో కాంగ్రెస్, బీజేపీల అసమర్థ పాలన
- దద్దమ్మ చర్యల వల్లే నీటి యుద్ధాలు
- జల సమస్యలపై మోదీ, మన్మోహన్ జవాబు చెప్పాలి
- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ అగ్రస్థానం
దేశం కోసం తాను చేసిన ఆలోచనతో దేశ వ్యాప్తంగా ప్రకంపనలు వస్తున్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఈ రోజు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లిలో ప్రారంభమైన 17వ ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్, బీజేపీల అసమర్థ పాలన, దద్దమ్మ చర్యల వల్లే నీటి యుద్ధాలు వస్తున్నాయని అన్నారు. జల సమస్యలపై ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశంలో అందుబాటులో ఉన్న నీళ్లు 70 వేల టీఎంసీలని 2004లో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ వేశారని, 14 ఏళ్లయినా నీటి సమస్యలను ట్రైబ్యునల్ తేల్చలేదని విమర్శించారు. తాము ఫెడరల్ ఫ్రంట్‌తో దేశ వ్యాప్తంగా రైతులకు న్యాయం చేస్తామని, జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ కు క్రియాశీల పాత్ర పోషించే బాధ్యతను ప్రజలు అప్పగించారని అన్నారు.
అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ అని, ప్రపంచం కీర్తించిన అపూర్వమైన పథకాలు మిషన్ కాకతీయ, భగీరథ అని కేసీఆర్ అన్నారు. ఇటీవల తాను బెంగుళూరులో మాజీ ప్రధాని దేవెగౌడతో మాట్లాడానని చెప్పారు. తెలంగాణలో అమల్లో ఉన్న పథకాలను కర్ణాటకలోనూ అమలు చేస్తే బాగుంటుందని ఆయన అన్నారని చెప్పారు. మరోవైపు మహారాష్ట్ర ప్రజలు కూడా తెలంగాణ లాంటి సంక్షేమ కార్యక్రమాలు కావాలని ఆ రాష్ట్ర సర్కారుని అడుగుతున్నారని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు.
ప్రగతి భవన్‌లో 150 గదులు ఉన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రగతి భవన్‌కు మీడియాతో వచ్చి 150 గదులు చూపాలని, 15 గదుల కంటే అదనంగా చూపితే సీఎం పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. పరిపాలన సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. గతేడాది 19.88 శాతం సొంత రాబడితో దేశంలో అగ్రస్థానంలో నిలిచామని అన్నారు. టీపీసీసీ నేతలు సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేసులు వేశారని ఆరోపించారు. తాము 2014లో ఎన్నికల ముందు పెట్టిన మెనిఫెస్టోను నూరు శాతం అమలు చేశామని అన్నారు. టీఆర్‌ఎస్‌ను చూసి కాంగ్రెస్ సిగ్గుపడాలని, తెలంగాణలోని ప్రాజెక్టులపై 250 కేసులు పెట్టారని అన్నారు.