Pawan Kalyan: బేషరతుగా క్షమాపణ చెబుతారో.. క్రిమినల్ చర్యలు ఎదుర్కొంటారో మీ ఇష్టం: పవన్‌కు ఆర్కే నోటీసులు

  • మీ ట్వీట్ల వల్ల నా పరువుకు భంగం వాటిల్లింది
  • బహిరంగంగా, రాతపూర్వకంగా క్షమాపణలు చెబితే సరే
  • నేరపూరిత కుట్రలో భాగంగానే మీరు ట్వీట్లు చేస్తున్నారు
  • పీకేకు పంపిన నోటీసుల్లో ఆర్కే

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ లీగల్ నోటీసులు పంపించారు. తన సంస్థపై ఊహాజనితంగా చేసిన ఆరోపణలను, ట్వీట్లను బేేషరతుగా ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే తాను తీసుకోబోయే సివిల్, క్రిమినల్ చర్యలకు సిద్ధంగా ఉండాలని నోటీసులో పేర్కొన్నారు.  

పవన్ తన వ్యక్తిగత, రాజకీయ లోపాలను కప్పిపుచ్చుకునేందుకే తనపై ఉద్దేశపూర్వకంగా ట్వీట్లు చేస్తున్నారని ఆర్కే పేర్కొన్నారు. ఆయన చేస్తున్న ఆరోపణల్లో వీసమెత్తు అయినా వాస్తవం లేదని తేల్చి చెప్పారు.  పవన్ ఆరోపిస్తున్నట్టు టీఆర్పీ కోసం మహిళలను దూషించే అలవాటు తమకు లేదని, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి వార్తా సంస్థలు నియంత్రణ సంస్థలకు లోబడి పనిచేస్తాయని స్పష్టం చేశారు.

పవన్ ఆరోపిస్తున్నట్టు తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేవన్నారు. ట్విట్టర్‌లో పవన్ కొన్ని రోజులుగా చేస్తున్న ట్వీట్లతో ఆయన అభిమానుల్లో అసహనం పెరిగిందని, ఈ కారణంగానే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ప్రతినిధులపై దాడిచేశారని, వాహనాలను ధ్వంసం చేశారని ఆర్కే తన నోటీసుల్లో పేర్కొన్నారు.

పవన్ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నేరపూరిత కుట్రలో భాగంగా మరికొందరితో కలిసి పవన్ ఈ ట్వీట్లు చేస్తున్నట్టు తాను భావిస్తున్నానని ఆర్కే వివరించారు. ఆయన ట్వీట్ల కారణంగా తాను ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని, తన పరువుకు భంగం వాటిల్లిందని నోటీసులో పేర్కొన్నారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన పవన్.. చేసిన ట్వీట్లపై వివరణ ఇచ్చి బహిరంగంగా, రాత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని రాధాకృష్ణ హెచ్చరించారు.

Pawan Kalyan
Andhrajyothy
Radhakrishna
  • Loading...

More Telugu News