Chandrababu: పవన్ ను ఏనాడూ విమర్శించలేదు... మాకు బురద చల్లే అలవాటు లేదు: చంద్రబాబు
- మొన్నటిదాక మనతోనే ఉన్న పవన్... ఇప్పుడు మనల్నే విమర్శిస్తున్నారు
- ఏపీ పట్ల కేంద్రం వివక్ష చూపుతోంది
- గెలవడం చేతకానివారు... దొడ్డిదారులు చూసుకుంటున్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టీడీపీ ఎన్నడూ విమర్శించలేదని... ఎదుటివారిపై బురద చల్లే అలవాటు టీడీపీకి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మొన్నటిదాకా మనతోనే ఉన్న ఆయన ఇప్పుడు మనల్నే విమర్శిస్తున్నారని చెప్పారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో తాను ఎవరిపైనా విమర్శలు చేయలేదని... కేవలం సమస్యలపైనే పోరాడానని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం మనల్ని ఎన్ని విధాల ఆడించాలో అన్ని విధాలా ఆడిస్తోందని మండిపడ్డారు. ఏపీ పట్ల వివక్ష చూపుతోందని అన్నారు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ బర్తరఫ్ చేసిందని... ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీకి తెలుగువారు బుద్ధి చెప్పారని... తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనని చెప్పారు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కూడా ఇదే పని చేస్తోందని విమర్శించారు.
కేంద్ర, రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను ప్రజలంతా ఒక కన్నేసి ఉంచాలని చూశారు. అడ్డదారుల్లో ముందుకు వెళ్లడంలో కొందరు సిద్ధహస్తులని... స్వతహాగా గెలవడం చేతకానివారు, దొడ్డిదారులను చూసుకుంటున్నారని అన్నారు. వెంకటేశ్వరస్వామి సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడిలో జరిగిన సభలో మాట్లాడుతూ చంద్రబాబు పైవ్యాఖ్యలు చేశారు.