Madhya Pradesh: నడిరోడ్డుపై మోడల్‌కు చేదు అనుభవం.. స్పందించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
- ఇండోర్‌కు చెందిన మోడల్
- యాక్టివా మీద వెళుతుండగా ఘటన
- స్కర్ట్‌ను లాగేందుకు ఇద్దరు ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు
- దుండగులను పట్టుకుంటామన్న శివరాజ్ సింగ్ చౌహాన్
ఇండోర్‌కు చెందిన ఓ మోడల్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించి చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. తాను యాక్టివా స్కూటర్ మీద వెళుతున్నానని, ఇద్దరు పోకిరీలు తన స్కర్ట్‌ను లాగేందుకు ప్రయత్నించి, అసభ్యకరంగా మాట్లాడారని ట్విట్టర్లో చెప్పింది. వారి నుంచి తప్పించుకుని వెళ్లే క్రమంలో తాను బైక్‌పై నుంచి కిందపడిపోవడంతో గాయాలు అయ్యాయని పేర్కొంటూ, తన గాయాలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ ఘటన ఇండోర్‌లోని రద్దీ రోడ్డులో జరిగిందని తెలిపింది. అందరు చూస్తూ వెళ్లిపోయారే కానీ, ఒక్కరూ కూడా ఆ పోకిరీలను ఏమీ అనలేదని చెప్పింది. తాను వారి బైక్ నంబర్‌ను కూడా గమనించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. ఏ దుస్తులు వేసుకోవాలన్నది తన ఇష్టమని ఆమె పేర్కొంది. స్కర్ట్ వేసుకుని బయటకు వస్తే అసభ్యంగా ప్రవర్తించే హక్కు వారికి ఇచ్చినట్టు కాదని అంది. ఓ వ్యక్తి ఈ ఘటన జరిగిన తరువాత తన వద్దకు వచ్చి స్కర్ట్ వేసుకున్నందుకే ఇలా చేశారని అన్నాడని, ఆయన వ్యాఖ్య తనను ఎంతగానో బాధించిందని ఆమె తెలిపింది.
రద్దీ రోడ్డులోనే పరిస్థితి ఇంతగా ఉంటే, జనాలు లేని వీధుల్లో ఇంకా దారుణంగా ఉంటుందేమోనని పేర్కొంది. ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు కూడా లేవని, ఈ ఘటనపై తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది. ఆమె చేసిన ట్వీట్‌పై స్పందించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ దుండగులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని ట్విట్టర్లో పేర్కొన్నారు.