Andhra Pradesh: బీసీలే తమకు వెన్నెముకంటూ చంద్రబాబు వారి వెన్ను విరుస్తున్నారు: రఘువీరారెడ్డి
- బీసీలను కీలక స్థానాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు
- బడుగు బలహీన వర్గాలపై వ్యతిరేక వైఖరిని నిరసిస్తున్నాం
- ఈ నెల 25న ఏపీ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడతాం
తమ పార్టీకి బీసీలే వెన్నెముకంటూ చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు.. వారి వెన్ను విరుస్తున్నారంటూ ఏపీ సీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ బీసీ కమిషన్ (ఎన్సీబీసీ) మాజీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య ఈరోజు పత్రికలకు వెల్లడించిన విషయాల ద్వారా ఈ సంగతి తేటతెల్లమౌతోందని అన్నారు. మాటలతో గారడీ చేస్తూ ఆచరణలో బీసీల పట్ల వివక్ష చూపిస్తున్నారని, న్యాయ వ్యవస్థ సహా అన్ని రంగాల్లో వారు కీలక స్థానాల్లోకి రాకుండా చంద్రబాబునాయుడు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
బడుగు బలహీన వర్గాలపై చంద్రబాబు వ్యతిరేక వైఖరిని నిరసిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ ఉదయం10 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా ఫూలే విగ్రహాల దగ్గర నిరసన ప్రదర్శనలకు పిలుపు నిస్తున్నట్టు తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు హైకోర్టు జడ్జిలుగా నియామకం కాకుండా వారి అవకాశాలను దెబ్బ తీసేందుకు వారిపై నిందలు, తప్పుడు ఆరోపణలతో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు చంద్రబాబు లేఖలు రాశారని, ఆ లేఖల ప్రతులను జస్టిస్ ఈశ్వరయ్య బయట పెట్టారని అన్నారు. చంద్రబాబుకు బీసీల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఉన్న వివక్ష, చిన్న చూపును బీసీలు ఇప్పటికైనా గుర్తించాలని కోరారు.
కాగా, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో చంద్రబాబు బీసీ, ఎస్సీ అభ్యర్థులపై తప్పుడు ఆరోపణలతో కూడిన నివేదిక పంపినట్లు తెలుస్తోందని రఘువీరా అన్నారు. 2016 ఏప్రిల్ 30 వ తేదీన అప్పటి హైకోర్ట్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ దిలీప్ బి. భోసలే ఆరుగురు న్యాయవాదుల పేర్లను హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సూచించారని, దానిపై ఇద్దరు ముఖ్యమంత్రుల అభిప్రాయం కోరితే తెలంగాణ ముఖ్యమంత్రి నెల లోపే అభిప్రాయం తెలిపారని, చంద్రబాబు మాత్రం 11 నెలలు తాత్సారం చేశారని, 2017 మార్చి 21న తన అభిప్రాయం పంపారని అన్నారు.
ఆ నివేదికలో ఆరుగురిలో ఇద్దరు బీసీ అభ్యర్థులు, ఒక ఎస్సీ అభ్యర్థి, మరొక ఇతర సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిపై తప్పుడు ఆరోపణలు చేశారని, వారు పనికి రారని పేర్కొన్నారని అన్నారు. ఆ తప్పుడు నివేదికనే మక్కీకి మక్కీగా అందజేసి ఆ నలుగురు అభ్యర్థుల నియామకానికి మోకాలడ్డే ప్రయత్నం చంద్రబాబు చేశారని, ఈ నివేదికపై ఇంటలిజెన్స్ బ్యూరో విచారణ చేపట్టి ఆ నలుగురిపై ఇచ్చిన నివేదికలో వాస్తవం లేదని తేల్చి చెప్పడంతో వారు జడ్జిలుగా నియమితులయ్యారని ఆ ప్రకటనలో తెలిపారు.