impeachment notice: వెంకయ్యనాయుడు కీలక నిర్ణయం... సుప్రీం చీఫ్ జస్టిస్ అభిశంసన నోటీసు తిరస్కరణ!

  • చీఫ్ జస్టిస్ పై ఆరోపణలకు సరైన ఆధారాల్లేవని అభిప్రాయం
  • న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులతో విస్తృత సంప్రదింపులు
  • అనంతరం తిరస్కరిస్తూ నిర్ణయం ప్రకటించిన వెంకయ్యనాయుడు

రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను అభిశంసించేందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసును తిరస్కరిస్తూ ఈ రోజు నిర్ణయం ప్రకటించారు. ఈ నోటీసుకు ఉన్న అర్హతపై ఆయన రాజ్యాంగ, న్యాయనిపుణులతో సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐకి చెందిన 64 మంది ఎంపీలు, ఇటీవల పదవీ విరమణ చేసిన ఆరుగురు రాజ్యసభ మాజీ సభ్యులు సంతకాలు చేసిన అభిశంసన నోటీసును శుక్రవారం వెంకయ్యనాయుడుకు అందజేసిన విషయం తెలిసిందే.

మూడు రోజుల పాటు ఆయన దీనిపై విస్తృత సంప్రదింపులు నిర్వహించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, న్యాయకోవిదుడు కె.పరాశరన్, లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, న్యాయశాఖ మాజీ సెక్రటరీ పీకే మల్హోత్రా తదితరుల అభిప్రాయాలను వెంకయ్య తెలుసుకున్నారు. అలాగే, రాజ్యసభ సెక్రటేరియట్ సీనియర్ అధికారులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ సూచనలను కూడా తీసుకున్న తర్వాతే నోటీసును తిరస్కరించాలనే నిర్ణయానికొచ్చారు.

‘‘అభిశంసన నోటీసులో పేర్కొన్న ఐదు ఆరోపణలు, అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించాను. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దుష్ప్రవర్తనకు సంబంధించి అవి సరైన, సహేతుకమైన కారణాలు కావని భావిస్తున్నాను’’ అంటూ వెంకయ్యనాయుడు తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే, దీనిపై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

impeachment notice
Venkaiah Naidu
  • Loading...

More Telugu News