Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ లేవనెత్తిన ప్రశ్నలు, డిమాండ్లపై వచ్చిన స్పష్టత.. రేపు నిర్ణయం తీసుకోనున్న సినీ పరిశ్రమ!

  • మహిళల గౌరవానికి భంగం వాటిల్లేలా టీవీల్లో కథనాలు 
  • మీరేం చేస్తున్నారు? 
  • ఓ టీవీ ఎడిటర్‌ మహిళా నటులపై అనుచిత వ్యాఖ్యలు
  • 24 క్రాఫ్ట్స్ ఒకే తాటిపైకి రావాలి-పవన్

తెలుగు చిత్ర పరిశ్రమను పలుచన చేస్తూ... మహిళా ఆర్టిస్టుల గౌరవానికి భంగం కలిగిస్తూ చిత్రసీమలోని కుటుంబాలను అభాసుపాలు చేసేలా మీడియాలో కథనాలు వస్తుంటే చట్టపరంగా ఏమి చేస్తున్నారని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా), నిర్మాతల మండలి, దర్శకుల సంఘం, ఫిల్మ్ ఫెడరేషన్.. తదితర విభాగాల నాయకులని తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించినట్లు జనసేన మీడియా హెడ్‌ హరిప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

అలాగే, తెలుగుదేశం పార్టీ.. తమకు అనుకూలంగా ఉన్న మీడియా ద్వారా కథనాలు ప్రసారం చేయిస్తోందని, కుట్ర పూరిత ధోరణితో వ్యవహరిస్తోందని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అందులో పేర్కొన్నారు. తమ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌.. ఈ రోజు ఉదయం 10 గంటలకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకుని, తెలుగు సినిమా రంగాన్ని కించపరుస్తూ కొన్ని టీవీ ఛానళ్లు వ్యవహరిస్తున్న తీరు, వాటిపై పరిశ్రమ పరంగా ఏమి చేస్తున్నారంటూ ప్రశ్నించారని అన్నారు.

పవన్ కల్యాణ్‌  ఛాంబర్ కు రావడంతో మా, నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ లతోపాటు వివిధ యూనియన్ల నాయకులు అక్కడికి హుటాహుటిన వచ్చారని చెప్పారు. మహిళా ఆర్టిస్టులను, ఈ రంగంలో పనిచేస్తోన్న ఇతర మహిళల్ని కించపరిచేలా కొందరు మాట్లాడుతుంటే ఏమి చేస్తున్నారని ఆయన నిలదీశారని చెప్పారు.

"ఒక ఛానల్ లో (టీవీ5) ఓ ఎడిటర్ కొన్ని రోజుల ముందు సినిమా రంగంలో అటువంటి వారు లేరా? అని అవమానకరంగా మాట్లాడితే ఏమి చేశారు? క్యాస్టింగ్ కౌచ్ పేరుతో మొత్తం తెలుగు చిత్ర సీమను పలుచన చేసేలా వార్తలు, కథనాలు వస్తుంటే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? చట్టపరంగా పోరాడడానికి 24 క్రాఫ్ట్స్ ఒకే తాటిపైకి రావాలి... మహిళల ఆత్మాభిమానాన్ని కాపాడాలి. ఇందుకు అన్ని విభాగాలు కలసి నిర్ణయం తీసుకోవాలి. తక్షణం దీనిపై కదలాలి" అని పవన్ కల్యాణ్ అన్నారని వివరించి చెప్పారు. పలువురు మహిళా నటులు, డాన్సర్స్, జూనియర్ ఆర్టిస్ట్స్ ఈ తరహా కథనాల మూలంగా ఎదుర్కొంటున్న అవమానాల్ని, ఇబ్బందుల్ని పవన్ వారికి తెలియచేశారని పేర్కొన్నారు.
 

రేపు చిత్ర పరిశ్రమ సమావేశం

పవన్ కల్యాణ్‌ అక్కడకు రావడంతో సినీ పరిశ్రమకు చెందిన శివాజీ రాజా, హేమ, అనితా చౌదరి, ఏడిద శ్రీరామ్, యువ కథానాయకులు రాంచరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, కృష్ణుడు, దర్శకుల సంఘం తరఫున ఎన్.శంకర్, వినాయక్, మెహర్ రమేష్, శ్రీకాంత్ అడ్డాల, వీర శంకర్, మారుతి.. నిర్మాతల మండలి నుంచి సుధాకర్ రెడ్డి, దామోదర ప్రసాద్, అల్లు అరవింద్, సుప్రియ, కె.ఎస్.రామారావు, ఎన్.వి.ప్రసాద్, నాగ అశోక్ కుమార్, ఎస్.రాధాకృష్ణ , సూర్యదేవర నాగవంశీ, పీడీ ప్రసాద్, ముత్యాల రాందాస్, కుమార్ చౌదరి, రచయితలు పరుచూరి బ్రదర్స్, విశ్వ, ఫెడరేషన్ నుంచి కొమర వెంకటేశ్ తదితరులు వచ్చారని జనసేన మీడియా హెడ్‌ తెలిపారు.

టాలీవుడ్‌లో ప్రస్తుత పరిణామాలు, పవన్ కల్యాణ్  వ్యక్తం చేసిన నిరసనలపై రేపు విస్తృత సమావేశం నిర్వహించాలని తెలుగు చిత్ర పరిశ్రమ నిర్ణయం తీసుకొందని చెప్పారు. ఆ సమావేశంలో తీసుకొనే నిర్ణయాలకు అనుగుణంగా తమ కార్యాచరణ ప్రకటిస్తారని తెలిపారు.

  • Loading...

More Telugu News