harshavardhan: 50 రూపాయల విలువ నాకు తెలుసు .. అందుకే ఆ వేషం వేశాను: నటుడు హర్షవర్ధన్
- ఆ సీరియల్ ఆగిపోయింది
- ఏం చేయాలో తోచలేదు
- ఆ సమయంలో ఫోన్ కాల్ వచ్చింది
నటుడిగా .. రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్ధన్, తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరియర్ కి సంబంధించిన విషయాలను ప్రస్తావించారు. " నేను 'ఋతు రాగాలు' సీరియల్ చేస్తుండగా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అప్పటికి ఆ సీరియల్ ప్రసారమవుతుందో లేదో తెలియదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సీరియల్ ఆగిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.
ఆ సమయంలో తెలిసిన వ్యక్తి ఫోన్ చేసి షూటింగ్ ఉందంటే పరిగెత్తుకుంటూ వెళ్లాను. అప్పటికి ఆ డైరెక్టర్ పేరు ఎవరికీ తెలియదు .. ఫ్రీడమ్ ఫైటర్స్ పై సీరియల్ తీస్తున్నాడు. అందులో గుంపులో గోవిందంలా నిలబడమన్నారు. 50 రూపాయలు ఇస్తామనడంతో నిలబడ్డాను. మెయిన్ రోల్ కోసం తీసుకున్న వ్యక్తి సరిగ్గా డైలాగ్ చెప్పలేకపోతుండటంతో, నేను చెబుతానని అడిగి మరీ చెప్పాను. నేను మంచి ఆర్టిస్ట్ ను అవుతానని ఆ డైరెక్టర్ చెప్పాడు .. ఆయన ఎవరో కాదు పూరీ జగన్నాథ్. 50 రూపాయల విలువ నాకు తెలుసు .. ఆ డబ్బును నాకు ఇప్పించడం కోసం ఫోన్ చేసిన వ్యక్తి ప్రేమ విలువ తెలుసు .. అందుకే ఆ వేషం వేశాను" అని హర్షవర్ధన్ చెప్పుకొచ్చాడు.