South west Airlines: 30 వేల అడుగుల ఎత్తులో ఇంజిన్ పేలినా.. విమానాన్ని క్షేమంగా దించిన మహిళా పైలట్!

  • 30 వేల అడుగుల ఎత్తులో పేలిన ఇంజిన్
  • ఫ్యాన్ బ్లేడ్ దూసుకొచ్చి విమానాన్ని తగలడంతో కిటికీకి రంధ్రం
  • విమానంలోంచి జారి పడబోయిన రియోర్డాన్

సౌత్‌ వెస్ట్‌ ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన నంబర్‌ 1380 విమానం 30,000 అడుగుల ఎత్తులో ఉండగా సంభవించిన ఇంజిన్ పేలుడుతో 149 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... న్యూయార్క్‌ నుంచి డల్లాస్‌ కు 144 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో విమానం బయల్దేరింది. కాసేపటికి విమానంలో ఒక్కసారిగా పేలుడు శబ్దం వినపించింది. దీంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఇంజిన్ పేలడంతో విమానం ఫ్యాన్‌ బ్లేడ్‌ చెడిపోయి, పదునైన రెక్క దూసుకొచ్చి విమానం కిటికీని బలంగా తాకింది. దీంతో కిటికీ పగిలిపోయింది. ఆ కిటికీలోంచి అక్కడే కూర్చున్న రియోర్డాన్‌ అనే ప్రయాణికురాలు కిందికి జారిపడబోయింది. ఆమెను సహప్రయాణికులు లోపలికి లాగినప్పటికీ తీవ్రగాయాల పాలయింది. దీంతో విమానంలో గందరగోళం చెలరేగింది. ప్రయాణికులందరూ తమకు భూమిమీద నూకలు చెల్లిపోయాయని భావించారు. సుమారు 20 నిమిషాలు నరకయాతన పడ్డారు. కొందరు భగవంతుడిని వేడుకుంటూ ప్రార్థనలు చేశారు.

అయితే ఆ విమానం నడుపుతున్న పైలట్ టామ్ జో షల్ట్స్ మాత్రం ఎలాంటి భయం లేకుండా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ఫిలడెల్పియాలోని కంట్రోల్ రూంను సంప్రదించారు. పరిస్థితి వివరించారు. వారు అన్ని ఏర్పాట్లు చేయడంతో ల్యాండ్ చేయడానికి ఏమాత్రం అవకాశం లేని విమానాన్ని ఆమె సురక్షితంగా కిందికి దించారు. అమెరికన్‌ నేవీలో పనిచేసిన మొదటి మహిళా పైలట‍్లలో టామ్‌ జో షల్ట్స్‌ ఒకరు. ఆమెకు సూపర్‌ సోనిక్‌ ఎఫ్‌జె-18 హార్నెట్స్‌ వంటి విమానాలు నడిపిన అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే ఆమె విమానాన్ని సురక్షితంగా కిందికి దించి, శభాష్ అనిపించుకున్నారు.

అయితే తీవ్రంగా గాయపడిన రియోర్డాన్ ఆసుపత్రిలో చికత్సపొందుతూ మరణించారు. ఈ ఘటనలో మరో ఏడుగురు గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ, ఈ విమాన ప్రమాదం వల్ల మరింత జాగ్రత్తగా ఉంటామని, ఇంజన్‌ లోని బ్లేడ్‌ పాతబడటం వల్లే పేలుడు జరిగిందని వారు వెల్లడించారు. అమెరికా విమాన ప్రమాదాల్లో 2009 తర్వాత చోటు చేసుకున్న తొలి మరణం ఇదేనని పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News