Tollywood: నిర్మాతల మండలితో మాట్లాడా..సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చింది: నటుడు నాగబాబు
- ముఖ్యంగా మూడు విషయాలను వారితో ప్రస్తావించా
- దీనిపై సానుకూలంగా స్పందించారు
- ఓ వారం రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది
ఆర్టిస్ట్ లకు కనీస సౌకర్యాలు కల్పిస్తామని, సమస్యలను పరిష్కరిస్తామని నిర్మాతల మండలి హామీ ఇచ్చిందని ప్రముఖ నటుడు నాగబాబు అన్నారు. మీడియాతో సమావేశం అనంతరం నిర్మాతల మండలిని కలిసి వాళ్లతో మాట్లాడానని చెప్పారు. ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్ కిరణ్ తో, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కేఎల్ నారాయణతో తాను మాట్లాడానని, ముఖ్యంగా మూడు విషయాలను వారితో ప్రస్తావించానని అన్నారు.
క్యాస్టింగ్ కౌచ్, షూటింగ్ ఎన్విరాన్ మెంట్ లో ఆడవాళ్లకు కనీసం టాయిలెట్ సౌకర్యం, డ్రెస్ మార్చుకోవడానికి సౌకర్యాలు కల్పించాలని, కోఆర్డినేటర్ల ద్వారా కాకుండా ఆర్టిస్ట్ లకు నేరుగా డబ్బులందేలా ఓ ప్రణాళిక ఆలోచించాలని చెప్పానని అన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించారని, ఈ విషయమై వారం రోజుల్లో ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పారు.
ఒకవేళ, వారం రోజుల్లోగా ప్రకటన వెలువడకపోతే తాను మళ్లీ వెళ్లి వారిని కలుస్తానని, ఒత్తిడి చేస్తానని అన్నారు. అయితే, వారిపై ఒత్తిడి చేయాల్సిన అవసరం రాదని అనుకుంటున్నానని, ఎందుకంటే వాళ్లందరూ మానవత్వం ఉన్న వ్యక్తులని, సమస్యలన్నీ కచ్చితంగా పరిష్కారమవుతాయని చెప్పారు. తమ వేతనాలు తమకు అందడం లేదని, షూటింగ్ ఎన్విరాన్ మెంట్ లో సరైన సౌకర్యాలు లేవని బాధపడ్డ సాధారణ ఆర్టిస్ట్ లు సాధించిన విజయమిదని, వారిని అభినందిస్తున్నానని నాగబాబు అన్నారు.