Pawan Kalyan: ‘జనసేన’పై ఏపీ ప్రభుత్వం నిఘా? గన్ మెన్లను వెనక్కి పంపిన పవన్ కల్యాణ్ !
- తనపై నిఘా కోసం గన్ మెన్లను వాడుకుంటోందని పవన్ అనుమానం
- ‘జనసేన’ అంతర్గత విషయాలు, సమావేశాల వివరాలు లీక్?
- అందుకే, ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం తనకు కేటాయించిన భద్రతా సిబ్బందిని పవన్ వెనక్కి పంపారు. భద్రతా సిబ్బందిని ప్రభుత్వం నిఘా కోసం వాడుకుంటోందనే అనుమానంతో పవన్ వారిని తిప్పి పంపినట్టు తెలుస్తోంది. జనసేన పార్టీ అంతర్గత విషయాలు, సమావేశాల వివరాలు మొదలైనవి లీక్ అవుతున్నాయని పవన్ భావిస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు నలుగురు గన్ మెన్లకు ఈ విషయాన్ని తెలిపిన పవన్ సిబ్బంది, ప్రభుత్వానికి సరెండర్ కావాలని సూచించారు.
కాగా, గత నెలలో గుంటూరులో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో తనపై దాడి జరిగే అవకాశముందని పవన్ పేర్కొనడంతో, దీనిపై స్పందించిన ప్రభుత్వం 2 ప్లస్ 2 గన్ మెన్ లను కేటాయించింది. ఈ గన్ మెన్ లను ఏర్పాటు చేసిన నెల తర్వాత, వారిని పవన్ వెనక్కి పంపడంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘జనసేన’లో జరుగుతున్న వ్యవహారాలను కనిపెట్టేందుకే ప్రభుత్వంలోని పెద్దలు తనకు సెక్యూరిటీ కల్పించినట్టు పవన్ భావిస్తున్నట్టు సమాచారం.