: 2 శాతం ఓట్లతో మారిన కాంగ్రెస్ తలరాత
కేవలం 2 శాతం ఓట్ల పెరుగుదల కర్ణాటకలో కాంగ్రెస్ కు విజయాన్ని కట్టబెట్టాయి. 2008నాటి ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ 80 స్థానాలను మాత్రమే సాధించి ప్రతిపక్షంలో కూర్చుంది. అప్పుడు కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు 34.59 శాతం. తాజా ఎన్నికల్లో సాధించిన ఓట్లు 36.50 శాతం. ఈ రెండు శాతం ఓట్లతో కాంగ్రెస్ సీట్లు 41 పెరిగాయి. మొత్తం 121 స్థానాలను కైవసం చేసుకుంది. ఎందుకిలా అంటే, బీజేపీ ఓటు బ్యాంకును అటు యడ్డీ, ఇటు బీఎస్ఆర్ పార్టీలు చీల్చడమే!
ఈ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఓట్లు 20 శాతం. యడ్యూరప్పకు చెందిన కర్ణాటక జనతా పార్టీ 10 శాతం ఓట్లను సాధించింది. దీంతో బీజేపీ స్థానాలు 40కి పడిపోయాయి. 2009 నాటి ఎన్నికల్లో ప్రజారాజ్యం, లోక్ సత్తా పార్టీలు చీల్చిన ఓట్ల వల్లే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్లు.. ఇప్పుడు కర్ణాటకలోనూ కాంగ్రెస్ కు యడ్డీ రూపంలో లక్ కలసి వచ్చింది. కాంగ్రెస్ ఇప్పుడు యడ్యూరప్పకు రుణపడి ఉన్నట్లే!